ఆరిపోయిన కంటిదీపాలు

కడుపున పుట్టిన పిల్లలు కళ్లెదుటే బుడిబుడి అడుగులు వేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు.. చిన్నారుల బంగారు భవితను ఊహించుకుంటూ ఎన్నెన్నో కలలు కన్నారు.. ఇంతలోనే ఆ కలల్ని కల్లలు చేస్తూ విధి పగబట్టింది.

Updated : 05 Dec 2022 06:07 IST

19 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారుల మృత్యువాత
శోకసంద్రంలో తల్లిదండ్రులు
వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరిక
కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వైద్య నివేదికల్లో నిర్ధారణ

కడుపున పుట్టిన పిల్లలు కళ్లెదుటే బుడిబుడి అడుగులు వేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు.. చిన్నారుల బంగారు భవితను ఊహించుకుంటూ ఎన్నెన్నో కలలు కన్నారు.. ఇంతలోనే ఆ కలల్ని కల్లలు చేస్తూ విధి పగబట్టింది. మాయదారి అనారోగ్యం 19 రోజుల వ్యవధిలోనే చిన్నారులిద్దరినీ పొట్టన పెట్టుకుంది. ఆ బాలలే ప్రాణంగా బతుకుతున్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల కేంద్రానికి చెందిన వేముల శ్రీకాంత్‌ ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడు. ఆయన భార్య మమత గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు అమూల్య (5), అద్వైత్‌ (20 నెలలు). పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని వారిద్దరూ ఆశపడ్డారు. గత నెలలో కుమారుడు అద్వైత్‌ వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో కరీంనగర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొంది ఇంటికి వచ్చాక మరోసారి అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ నవంబరు 16న కన్నుమూశాడు. వైద్యానికి రూ.5 లక్షలు పోసినా ప్రాణాలు దక్కలేదు. ఆ దుఃఖంలో ఉన్న కన్నవారిపై మరోసారి విధి పంజా విసిరింది. లక్ష్మీదేవిపల్లిలోని పాఠశాలకు వెళ్లిన కుమార్తె అమూల్య గత నెల 29న వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యం అందించి ఇంటికి పంపించారు. మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 1న హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడి ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున అమూల్య మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు పిల్లలూ ఒకేలా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై మృతి చెందారు. వైద్య నివేదికల్లో వారిద్దరి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు నిర్ధారణ అయింది. కానీ అందుకు కారణం మాత్రం వైద్యులు చెప్పలేదు. వైద్యానికి రూ.10లక్షలు అప్పు చేసినా పిల్లలు దక్కలేదంటూ తల్లిదండ్రులు రోదించడం చూపరులను కదిలించింది. గంగాధరలోని శ్మశానవాటికలో గతంలో బాబు అంత్యక్రియలు జరిపిన స్థలం పక్కనే పాపకు కర్మకాండ పూర్తిచేయడం అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది.
న్యూస్‌టుడే, గంగాధర

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని