Hyderabad: నగ్న చిత్రాలు తీసి పంపి బేరం.. శరీర ఆకృతి ఆధారంగా ధర!

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం వెలుగు చూసింది.

Updated : 05 Dec 2022 10:32 IST

 మహిళా సామాజిక కార్యకర్త  తెగువతో విషయం బట్టబయలు

ఈనాడు, హైదరాబాద్‌ కేశవగిరి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం వెలుగు చూసింది. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు/యువతులను లక్ష్యంగా చేసుకొని వ్యభిచార ముఠా చేస్తున్న ఘోరాలు బయటకు వచ్చాయి. నిస్సహాయ మహిళలను ఎంపిక చేసుకొని వారి నగ్నచిత్రాలు, వీడియోలు తీసి శరీర ఆకృతి ఆధారంగా దళారులు ధర నిర్ణయిస్తున్నారు. ఒక సామాజిక కార్యకర్త ధైర్యం చేసి, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌వర్మ సాయంతో వ్యభిచార ముఠా ఆగడాలకు కళ్లెం వేయగలిగారు. ఆదివారం సాయంత్రం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా, బసవకల్యాణ్‌ తాలూకా, రాజేశ్వర్‌ గ్రామానికి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌(35) లారీడ్రైవర్‌. కలబురిగి ప్రాంతానికి చెందిన వ్యభిచార గృహాల నిర్వాహకుడు గులాంకు ప్రధాన అనుచరుడు. అతడి ఆదేశాలతో వారం రోజుల క్రితం హుస్సేన్‌ పాతబస్తీ చేరాడు. బార్కస్‌ సలాలాలో నివాసం ఉంటున్న తన మరదలిని సంప్రదించాడు. ఇక్కడే ఏదన్నా పని వెతుక్కుంటానని ఈ ప్రాంతంలో గది అద్దెకు కావాలని అడిగాడు. బావ కావడంతో తన ఇంట్లోనే గది అద్దెకు ఇవ్వగా... పాతబస్తీలో తిరుగుతూ ఉపాధి వెతుక్కుంటున్నట్లు నమ్మించేవాడు. ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం గాలించేవారు.కష్టాలు తొలగించే ఉపాయం తన వద్ద ఉందంటూ మహిళలకు మాటలతో గాలం వేసి, తన గదికి తీసుకొచ్చేవాడు. వారి ముఖం, పాదాలు కనిపించకుండా సెల్‌ఫోన్‌లో వారి మిగిలిన శరీర భాగాల చిత్రాలు, వీడియోలు తీసేవాడు. వాటిని కలబురిగిలోని గులాంకు వాట్సప్‌ ద్వారా చేరవేసేవాడు. వాటిని చూసి గులాం వారికి ధర నిర్ణయించేవాడు. వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులున్నట్టు సమాచారం.

పొట్టిగా ఉన్నావ్‌..

హుస్సేన్‌ ఆగడాలన్నీ ఓ సామాజిక కార్యకర్త దృష్టికి వచ్చాయి. ముఠా ఆటకట్టించేందుకు మరో మహిళతో కలసి ఆమె అతడి గదికి వెళ్లారు. పొట్టిగా ఉన్నావని.. ఆమెను అతడు తిరస్కరించాడు. పక్కనే ఉన్న మరో మహిళను సోమవారం చక్కగా ముస్తాబై వస్తే ఫొటోలు, వీడియోలు తీసి ధర నిర్ణయిస్తానని చెప్పాడు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు బార్కస్‌ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హుస్సేన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి సెల్‌ఫోన్‌లో వీడియోలు, చిత్రాలున్నట్లు గుర్తించారు. బీదర్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలకు నగరం నుంచి పెద్దఎత్తున మహిళలు, యువతులు, బాలికలను కొనుగోలు చేసి చేరవేస్తున్నట్టు అంచనాకు వచ్చారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని