నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం.. విశాఖలో కలకలం

విశాఖ నగరం మధురవాడ పరిధి కొమ్మాది వికలాంగుల కాలనీలో నీళ్ల డ్రమ్ములో కుళ్లిన స్థితిలో ఓ మహిళ శవం దొరకడం తీవ్ర కలకలం రేకెత్తించింది.

Updated : 05 Dec 2022 06:07 IST

విశాఖపట్నం (పీఎంపాలెం), న్యూస్‌టుడే: విశాఖ నగరం మధురవాడ పరిధి కొమ్మాది వికలాంగుల కాలనీలో నీళ్ల డ్రమ్ములో కుళ్లిన స్థితిలో ఓ మహిళ శవం దొరకడం తీవ్ర కలకలం రేకెత్తించింది. పీఎంపాలెం పోలీసుల కథనం ప్రకారం.. ఎండాడలో వెల్డింగ్‌ దుకాణం నిర్వహించే నండూరి రమేష్‌కు వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. రుషి అనే వ్యక్తి రెండేళ్ల క్రితం రమేష్‌ వద్ద పనికి కుదిరాడు. అతని కుటుంబం నివసించేందుకు కాలనీలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చారు. ఆ ఇంట్లో రుషితో పాటు అతడి భార్య, కుమార్తె ఉండేవారు. రెండు నెలల క్రితం భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి పంపించానని, తానూ పని మానేస్తున్నాయని రుషి యజమానికి చెప్పి ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు. రెండురోజులుగా ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం ప్రారంభమైంది. స్థానికులు ఇంటి యజమాని రమేష్‌కు సమాచారం అందించారు. అతను ఇంటి తాళం తీసి చూడగా నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం ముక్కలై కుళ్లిన స్థితిలో ఉంది. పోలీసులకు తెలపడంతో నార్త్‌జోన్‌ సబ్‌డివిజన్‌ ఏసీపీ సీహెచ్‌.శ్రీనివాస్‌, సీఐ వై.రామకృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన మహిళ.. గతంలో ఆ ఇంట్లో అద్దెకు ఉన్నవారా.. లేక ఇంకెవరినైనా హత్య చేసి శవాన్ని తెచ్చి ఇక్కడ దాచారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని రమేష్‌ పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు