Crime News: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి హత్య

పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది బీడీఎస్‌ విద్యార్ధినిని దారుణంగా గొంతుకోసి హతమార్చాడు.

Updated : 06 Dec 2022 09:25 IST

స్నేహితురాలి ఇంట్లోనే దాడి చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ఘటన

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-పెదకాకాని: పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది బీడీఎస్‌ విద్యార్ధినిని దారుణంగా గొంతుకోసి హతమార్చాడు. ఈ ఘటన సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో చోటుచేసుకుంది. సర్జికల్‌ బ్లేడ్‌తో గొంతుకోసి కొనఊపిరితో ఉండగా ఒక గది లోంచి మరో గదిలోకి ఈడ్చుకుంటూ వెళ్లి తలుపులు బిగించి మరీ దారుణానికి పాల్పడ్డాడు. కేకలు విన్న స్థానికులు బాధితురాలిని బయటకు తీసుకొచ్చి పోలీసులకు సమాచారమివ్వటంతో ఆస్పత్రికి తరలించారు. తర్వాత కొద్దిసేపటికే ఆమె చనిపోయింది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వికి, అదే జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌కు మధ్య ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. తపస్వి విజయవాడలోని ఓ వైద్య కళాశాలలో బీడీఎస్‌ మూడో సంవత్సరం చదువుతుండగా.. జ్ఞానేశ్వర్‌ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వీరిద్దరూ కొంతకాలం గన్నవరంలో ఉన్నారు. ప్రేమ విషయమై విభేదాలు రావటంతో అతనిపై కృష్ణా జిల్లాలో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా అతడి నుంచి ఇబ్బందులు ఎదురవుతుండడంతో తక్కెళ్లపాడులో ఉంటున్న తన స్నేహితురాలికి చెప్పి బాధపడింది. ఆమె ధైర్యం చెప్పింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇద్దరినీ ఆమె తన ఇంటికి పిలిపించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్‌ జేబులోంచి సర్జికల్‌ బ్లేడ్‌ తీసి ప్రియురాలిపై దాడికి తెగబడ్డాడు. స్నేహితురాలు భయపడిపోయి కేకలు పెడుతూ పైఅంతస్తు నుంచి కిందకు దిగింది. ఇంటి యజమానికి చెప్పి పైకి తీసుకెళ్లేలోపే గది తలుపులు బిగించి అత్యంత దారుణంగా తపస్వినిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.. ఎంతగా కేకలు పెట్టినా జ్ఞానేశ్వర్‌ తలుపులు తీయకపోవటంతో గ్రామస్థులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. నిందితుడిని బంధించి కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

ఆ మాట అన్నందుకే..

తాను వేరే యువకుడిని పెళ్లి చేసుకుంటున్నానని మాటల సందర్భంలో చెప్పగానే ఆ యువకుడు ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు తెలిసింది. స్పృహ కోల్పోయిన తపస్విని గొంతుపై అదేపనిగా గాయపరచటంతో తీవ్రంగా రక్తం కారి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని గ్రామస్థులు తెలిపారు. అనంతరం నిందితుడు బ్లేడ్‌తో తన చేతిపై గాయం చేసుకుని ఆత్మహత్యయత్నం చేయబోగా గ్రామస్థులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. నేరం జరిగిన ప్రదేశానికి, ప్రేమికులకు ఏ సంబంధం లేదని పెదకాకాని సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. నిందితుడు, మృతురాలు కృష్ణాజిల్లావాసులని, వారిమధ్య ప్రేమ విషయమై కొంతకాలంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. తపస్వి తల్లిదండ్రులు ముంబయిలో ఉంటున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు