వాహనం బోల్తా.. నలుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం

వాహనం బోల్తాపడి నలుగురు దుర్మరణం చెందిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

Published : 06 Dec 2022 03:55 IST

వేమూరు, న్యూస్‌టుడే: వాహనం బోల్తాపడి నలుగురు దుర్మరణం చెందిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వీరంతా కొద్దిసేపటిలో స్వగ్రామానికి చేరాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం, నూలిపూడికి చెందిన 23 మంది అయ్యప్ప భక్తులు అయిదు రోజుల క్రితం శబరిమల వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుంటూరు జిల్లా తెనాలి రైల్వేస్టేషన్‌ వద్ద దిగి స్వగ్రామానికి వెళ్లేందుకు అదే గ్రామం నుంచి వచ్చిన బాడుగ వాహనం ఎక్కారు. మార్గమధ్యంలో బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని శివారు చెరువు వద్ద మూల మలుపులో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బొలిశెట్టి పాండురంగారావు (40), పాశం రాంబాబు (55), బాడితి రమేశ్‌(42) ప్రమాద స్థలంలో మృతి చెందగా, బుద్దాన పవన్‌కుమార్‌ (25) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. తీవ్ర గాయాలైన భరత్‌కుమార్‌, శ్రీనివాసరావు, లింకన్‌ను మెరుగైన వైద్యం కోసం గుంటూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన 16మందిని తెనాలి ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న మంత్రి జోగి రమేశ్‌ తెనాలి ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల ప్రభుత్వ సాయం ప్రకటించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని