సెల్‌ టవర్‌ ఎక్కి రైతు ఆత్మహత్య

తన పొలంలోని కాలువ గుండా నీరు పారితే భూమి ఊటెక్కి పంట దెబ్బతింటోందని, అందుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సెల్‌టవర్‌ ఎక్కిన ఓ రైతు అందరూ చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతమిది.

Published : 06 Dec 2022 04:34 IST

అందరూ చూస్తుండగానే టవల్‌తో ఉరి

లింగంపేట, న్యూస్‌టుడే: తన పొలంలోని కాలువ గుండా నీరు పారితే భూమి ఊటెక్కి పంట దెబ్బతింటోందని, అందుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సెల్‌టవర్‌ ఎక్కిన ఓ రైతు అందరూ చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతమిది. కామారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన పుట్ట ఆంజనేయులు(38) మరో ఇద్దరు సోదరులకు కలిపి చెరువు కింద అరగుంట భూమి ఉంది. చెరువు నీరు ఎప్పట్నుంచో ఆ భూమి గుండా తవ్విన కాల్వ ద్వారా దిగువనున్న పొలాలకు పారుతోంది. అయితే, యాసంగి పంటల కోసం చెరువు నీరు కాలువలకు విడుదల చేసేందుకు అధికారులు రెండు రోజుల క్రితం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పంట కాల్వలో పూడిక తీసేందుకు రైతులు సన్నద్ధమవుతుండగా సోమవారం మధ్యాహ్నం ఆంజనేయులు అడ్డుకున్నారు.

తమ పొలం గుండా నీరు పారనిచ్చేది లేదంటూ రైతులు, అధికారులతో వాదనకు దిగారు. నీరు పారితే తన పొలంలో పంట పండదని, అందుకుగానూ పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ ఒంటిగంట సమయంలో అదే గ్రామంలోని సెల్‌ టవర్‌ ఎక్కారు. ఫోన్‌లో తహసీల్దారు మారుతి, ఎస్సై శంకర్‌తో మాట్లాడారు. ఘటనా స్థలానికి డీఎస్పీని రప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆర్డీవో శ్రీనునాయక్‌, డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే టవర్‌పైనే టవల్‌తో ఉరేసుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. ‘నాన్నా కిందికి దిగు’ అంటూ పిల్లలు కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా ఆయన ఆత్మహత్యకు ఒడిగట్టారని స్థానికులు తెలిపారు. ‘ఆంజనేయులు కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నారు. పైపెచ్చు ఘటన జరిగిన సమయంలో మద్యం తాగి ఉన్నారు. గతంలోనూ ఆయన పలుసార్లు సెల్‌ టవర్‌ ఎక్కారు. పురుగుమందు తాగారు. కరెంటు తీగలు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ దఫా ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు’’ అని డీఎస్పీ తెలిపారు. రైతు ఆత్మహత్యపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు పిల్లల చదువు బాధ్యతా తీసుకోవాలన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని