Crime News: దక్కలేదనే అక్కసుతో చంపేశా.. పోలీసు విచారణలో ప్రియుడు జ్ఞానేశ్వర్‌

మెడికల్‌ స్టూడెంట్‌ ఆమె.. తల్లిదండ్రులు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా ఒంటరిగా ఇక్కడ ఉండి చదువుకుంటోంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడిని నమ్మింది.

Updated : 07 Dec 2022 07:02 IST

ఐవాచ్‌ లొకేషన్‌తో యువతి ఆచూకీ గుర్తింపు

ప్రేమించిన పాపానికి ప్రియుడి చేతిలో గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో సోమవారం రాత్రి దారుణ హత్యకు గురైన దంత వైద్య విద్యార్థిని (బీడీఎస్‌) తపస్వి ఉదంతంలో విస్మయకరమైన విషయాలు వెలుగుజూస్తున్నాయి. పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతోనే ఆమెను చంపేశానని ప్రియుడు జ్ఞానేశ్వర్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం ప్రేమగా మారడంతో ఆ యువతి తన ఒంటిపై ఉన్న ఆభరణాలు విక్రయించి అతడికి బైక్‌, ఐవాచ్‌ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలిసింది.

వీరిద్దరూ కొంతకాలం గన్నవరంలో కలిసి ఉన్నారు. ఆ క్రమంలో విభేదాలు ఏర్పడడంతో తపస్వి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి మాటల్లేవు. తాను ఇచ్చిన బైకు, ఐవాచ్‌ తిరిగి ఇచ్చేయాలని ఆమె కబురు పంపడంతో ఐవాచ్‌ వెనక్కు ఇచ్చేశాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేస్తున్నా స్పందించకపోయేసరికి అతడు కోపం పెంచుకున్నాడు. తపస్వితో మాట్లాడించాలని ఆమె స్నేహితురాలిని కోరినా స్పందన లేకపోవటంతో కసి పెంచుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. తపస్వి గిఫ్ట్‌గా ఇచ్చి వెనక్కు తీసుకున్న వాచీ ద్వారానే ఆమె ఆచూకీ కనిపెట్టి.. ఆమె బహుమతిగా ఇచ్చిన బైక్‌ మీదనే వచ్చి ఈ దారుణానికి పాల్పడడం విషాదకరం.

సోమవారం సాయంత్రం విజయవాడలో రెండు సర్జికల్‌ బ్లేడ్లు కొని.. తక్కెళ్లపాడులో స్నేహితురాలి ఇంట్లో ఉన్న తపస్వి వద్దకు వెళ్లాడు. ‘పెళ్లి చేసుకుంటావా.. చంపేయమంటావా?’ అని జేబులోంచి బ్లేడ్‌ తీసి తొలుత కడుపులో పొడిచి అడిగినట్లు తెలుస్తోంది. అయినా ఆ యువతి ‘చంపితే చంపేయ్‌ పెళ్లి మాత్రం చేసుకోనని’ తెగేసి చెప్పడంతోనే ఆగ్రహించి గొంతు కోశానని ఒప్పుకొన్నట్లు సమాచారం. తపస్వి కోరిక మేరకు జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చేసి ఓ కంపెనీలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆమె స్నేహితురాలిని విచారించగా షాక్‌లో ఏమీ చెప్పలేకపోయింది. మంగళవారం ఉదయం ఆమెకు పరీక్ష ఉండడంతో మధ్యాహ్నం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంబయిలో ఉద్యోగం చేస్తున్న తపస్వి తల్లిదండ్రులు సీతారత్నం, పి.మహేశ్‌కుమార్‌ మంగళవారం పెదకాకాని చేరుకున్నారు. మార్చురీలో ఉన్న కుమార్తె శవాన్ని చూసి ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు.

ఆమె ప్రేమ గుడ్డిది: మెడికల్‌ స్టూడెంట్‌ ఆమె.. తల్లిదండ్రులు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా ఒంటరిగా ఇక్కడ ఉండి చదువుకుంటోంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడిని నమ్మింది. తన ప్రేమను పంచింది.. నగలు అమ్మిమరీ ఎన్నో కొనిపెట్టేది.. కొన్నాళ్లు కలిసి ఉంది.. చివరకు అతడి చేతిలో హతమైంది!

అతడి ప్రేమ చెడ్డది: చిన్న కుటుంబం నుంచి వచ్చాడు అతడు.. ఇంజినీరింగ్‌ తప్పాడు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని నమ్మించేవాడు.. బెట్టింగ్‌కు, గంజాయికి జల్సాలకు అలవాటుపడ్డాడు.. అతడి హంగు చూసి నమ్మిన యువతి తర్వాత ఇవన్నీ తెలిసి దూరం పెట్టేసరికి తట్టుకోలేకపోయాడు.. ఆమెను క్రూరంగా చంపేశాడు!

నిందితుడి నేపథ్యమిదీ..

ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన మన్నె జ్ఞానేశ్వర్‌ కృష్ణా జిల్లాలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదివాడు. కొన్ని సబ్జెక్టులు ఫెయిలవడంతో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకునేందుకు వెళ్లాడు. అక్కడే చిన్న ఉద్యోగం చేసేవాడు. క్రికెట్‌ బెట్టింగ్‌, గంజాయికి అలవాటు పడి జల్సాలు చేసేవాడు. ఓసారి తపస్విని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని తెలిసింది. శని, ఆదివారాల్లో మిత్రులతో కలిసి విజయవాడ-గుడివాడ రహదారిపై చక్కర్లు కొట్టేవాడని.. మద్యం మత్తులో పలువురిపై దాడులకు తెగబడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇంజినీరింగ్‌ ఫెయిల్‌ కావడంతో కొన్నాళ్లు పెయింటింగ్‌, తాపీ పనులకు కూడా వెళ్లాడన్నారు. అతడి తండ్రి నూజివీడులో చిరుద్యోగి కాగా, తల్లి ఉపాధి హామీ పథకంలో మేస్త్రీ.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు