వాగ్వాదం.. అంతలోనే కిరాతకం

ఓ యువకుడితో వాగ్వాదానికి దిగిన ఆరుగురు వ్యక్తులు.. చివరకు అతన్ని అతి కిరాతకంగా కడతేర్చిన దారుణమిది.

Published : 07 Dec 2022 04:05 IST

బెంగళూరులో నడివీధిలో యువకుడి హత్య
సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ఓ యువకుడితో వాగ్వాదానికి దిగిన ఆరుగురు వ్యక్తులు.. చివరకు అతన్ని అతి కిరాతకంగా కడతేర్చిన దారుణమిది. బెంగళూరు నగరం కేపీ అగ్రహార పోలీసు ఠాణా పరిధిలోని ఓ మందుల దుకాణం వద్ద శనివారం రాత్రి మంజునాథ బాళప్ప జమఖండి (32) అనే యువకుడు హత్యకు గురికాగా, పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసును మంగళవారం ఛేదించారు. మంజునాథ తన సొంతూరు బాదామిలో హోటల్‌ నడిపేవాడు. పదిరోజుల కిందట కొత్త ఉపాధి వెతుక్కుందామని బెంగళూరుకు చేరుకున్నాడు. కేపీ అగ్రహారలో ఉన్న బంధువులను కలిసేందుకు ఈ వీధిలో వెళ్తూ స్థానికంగా ఓ ఔషధ దుకాణంలో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి, బయట నిల్చున్నాడు. ఆ సమయంలో ముగ్గురు మహిళలతో సహా ఆరుగురు అక్కడికి వచ్చారు. తొలుత మంజునాథతో గొడవకు దిగారు. ఆపై కిందకు పడదోసి విపరీతంగా కొట్టారు. ఆ గుంపులో ఓ మహిళ చేతికందిన పెద్దరాయితో మంజునాథ తలబద్దలు కొట్టడానికి ఆగ్రహంతో ఉరికింది. అలా 20 సార్లు రాయితో శక్తికొద్దీ కొట్టి అక్కడే కడతేర్చింది. మిగతా ఐదుగురూ ఆమెకు సహకరించారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అనైతిక సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని