వాషింగ్‌ మెషిన్‌ వృథానీటి వివాదం.. వివాహిత దారుణ హత్య

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటుచేసుకుంది. వాషింగ్‌మిషన్‌ నుంచి వచ్చే వృథానీటిని వదలడంపై జరిగిన వివాదం పద్మావతి (34) అనే వివాహిత హత్యకు దారితీసింది.

Updated : 07 Dec 2022 06:48 IST

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటుచేసుకుంది. వాషింగ్‌ మెషిన్‌ నుంచి వచ్చే వృథానీటిని వదలడంపై జరిగిన వివాదం పద్మావతి (34) అనే వివాహిత హత్యకు దారితీసింది. ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. డ్యాన్స్‌ అకాడమీ నిర్వాహకుడు మనోహర్‌, ఆయన భార్య పద్మావతి ముగ్గురు పిల్లలతో కదిరి మశానంపేటలో ఉంటున్నారు. మంగళవారం తెల్లవారుజామునే ఆయన డ్యాన్స్‌ స్కూల్‌కు వెళ్లారు. 6 గంటలకు ఆమె దుస్తులు ఉతికేందుకు వాషింగ్‌ మెషిన్‌ ను ఇంటి ఎదుట ఉంచారు. అలాగైతే వృథానీరు తమ ఇంటి ముందుకు వస్తుందని పొరుగు ఇంటి యజమాని వేమన్ననాయక్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రమై వేమన్ననాయక్‌, ఆయన కుమారుడు ప్రకాష్‌నాయక్‌ పద్మావతిపై బండరాళ్లు, కొడవలితో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, వెంటనే కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. దారిలోనే ఆమె మరణించారు. మృతదేహాన్ని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తీసుకొచ్చారు.

కులాంతర వివాహమైనా..

డ్యాన్స్‌మాస్టర్‌ మనోహర్‌, పద్మావతిలది కులాంతర వివాహం. వీరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించడంతో దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండేది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఇప్పుడు పద్మావతి మృతితో పిల్లలు ముగ్గురూ తల్లి ప్రేమకు దూరమయ్యారు. మనోహర్‌, పిల్లల రోదనలు మిన్నంటాయి. కదిరి అర్బన్‌ సీఐ మధు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ మధు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని