వ్యభిచార కూపంలో 14,190 మంది యువతులు

వ్యభిచార ముఠా గుట్టురట్టు..అనగానే అయిదుగురో..ఆరుగురో పట్టుబడి ఉంటారనుకుంటారు. పెద్ద ముఠా అయితే 20 లేదా 30 మంది దొరికారని అనుకుంటారు.

Published : 07 Dec 2022 06:26 IST

వీరిలో రష్యా, ఉజ్బెకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, థాయిలాండ్‌ వాళ్లు కూడా
దేశంలోని 15 నగరాల నుంచి హైదరాబాద్‌కు రప్పిస్తున్న ముఠా
ఛేదించిన సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం
18 మంది అరెస్టు.. 35 ఫోన్లు స్వాధీనం..

ఈనాడు, హైదరాబాద్‌: వ్యభిచార ముఠా గుట్టురట్టు..అనగానే అయిదుగురో..ఆరుగురో పట్టుబడి ఉంటారనుకుంటారు. పెద్ద ముఠా అయితే 20 లేదా 30 మంది దొరికారని అనుకుంటారు. కానీ ఒక ముఠా ఏకంగా 14,190 మంది యువతులను వ్యభిచార ఊబిలోకి దింపిందంటే నమ్మగలరా? నగరాలు, ఇతర రాష్ట్రాల నుంచే కాదు...వివిధ దేశాల నుంచీ అమ్మాయిలను హైదరాబాద్‌కు రప్పిస్తూ..వ్యభిచార దందాను భారీ ఎత్తున నిర్వహిస్తున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. రష్యా, ఉజ్బెకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, థాయిలాండ్‌ సహా దేశంలోని 15 నగరాలకు చెందిన అమ్మాయిలను ఊబిలోకి దించి ప్రత్యేక వెబ్‌సైట్లు, వాట్సప్‌ గ్రూప్‌లు, కాల్‌ సెంటర్ల ద్వారా వ్యభిచారాన్ని వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్న ముఠాలోని 18 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్లలో జరుగుతున్న మానవ అక్రమ రవాణా, వ్యభిచారంలో 70 శాతం దందా ఈ ముఠా ఆధ్వర్యంలోనే సాగుతోంది. ఈ ముఠాకు చెందిన 18 మంది నిందితులపై నగరంలో ఇప్పటికే 37 కేసులున్నాయి. ప్రధాన సూత్రధారి, రాకెట్‌ నిర్వహణలో కీలక వ్యక్తి మహ్మద్‌ అదీమ్‌పై 10 కేసులున్నాయి. నిందితుల్లో రాడిసన్‌ హోటల్‌ మేనేజర్‌ రాకేశ్‌ కూడా ఉన్నాడు. వీరి నుంచి 35 స్మార్ట్‌ఫోన్లు, 3 కార్లు, 1 ల్యాప్‌టాప్‌, 2.5 గ్రాముల మాదకద్రవ్యం ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. సంచలనం సృష్టించిన కేసు వివరాలను సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం డీసీపీ కవిత ధార, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులుతో కలిసి సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం విలేకర్లకు వెల్లడించారు. నిందితులపై పీడీయాక్టు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గుట్టుగా నిర్వహణ

టోలిచౌకికి చెందిన సమీర్‌ (27).. ఫరూక్‌తో కలిసి 2018 నుంచి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. వీరికి మాసబ్‌ట్యాంకుకు చెందిన మహ్మద్‌ అదీమ్‌(31) అలియాస్‌ అర్నవ్‌, అభయ్‌, అర్నబ్‌, అర్నాఫ్‌, అరోరా, ఆశవ్‌, అతీఫ్‌, నిఖిల్‌ తోడయ్యాడు. అంతర్గత విభేదాలతో సమీర్‌ వాళ్ల నుంచి విడిపోయి సొంతంగా వ్యభిచార గృహం ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో గోల్కొండకు చెందిన అలీసామ్‌ (31) ద్వారా డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. కొన్నిరోజుల తర్వాత సమీర్‌ పాతమిత్రుడు అదీమ్‌తో చేతులు కలిపి ఉమ్మడిగా వ్యభిచార దందాను మొదలుపెట్టాడు. నగరంలోని కొన్ని హోటళ్లలో రిసెప్షనిస్టుగా పనిచేసిన బేగంపేటకు చెందిన మహ్మద్‌ సల్మాన్‌ ఖాన్‌ (23)తో పరిచయాలు పెంచుకుని వ్యభిచారం నిర్వహించడం ప్రారంభించాడు. సన్‌సిటీకి చెందిన అబ్దుల్‌ కరీమ్‌ అలియాస్‌ ఇర్ఫాన్‌కు సల్మాన్‌ఖాన్‌ కమీషన్ల ఆశ చూపించి తనతో చేర్చుకున్నాడు. ఆ తర్వాత అదీమ్‌, సమీర్‌, అలీసామ్‌, సల్మాన్‌ ఖాన్‌, కరీమ్‌ అంతా కలిసి కొన్ని హోటళ్ల సిబ్బంది సహకారంతో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ యువతుల ఫొటోలు సేకరించే మధ్యవర్తులు, కాల్‌సెంటర్ల నిర్వాహకులు వీరికి తోడవుతారు.

గుట్టు బయటపడిందిలా...

వ్యభిచార ముఠాల కార్యకలాపాలపై దృష్టిసారించిన సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం డీసీపీ కవిత ధార, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు బృందం... కొందరు యువతులు ఇచ్చిన సమాచారం, ఫోన్‌ నంబర్ల ఆధారంగా నవంబరు 15న సల్మాన్‌, అబ్దుల్‌ కరీమ్‌లను బండ్లగూడ జాగీరు దగ్గర సన్‌సిటీలో అరెస్టు చేశారు. వీరి నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా ఉన్నట్లు విచారణలో గుర్తించారు. ప్రధాన నిందితుడు అదీమ్‌, అతనితో సహజీవనం చేస్తున్న హర్బిందర్‌ కౌర్‌ (29), సమీర్‌ను సోమాజిగూడలో అరెస్టు చేశారు. ఇలా ఒకరి తరువాత ఒకరుగా మొత్తం 18 మంది చిక్కారు.

50 శాతం పశ్చిమబెంగాల్‌ నుంచే..

ఈ రొంపిలో ముంబయిసహా వివిధ రాష్ట్రాలకు చెందిన మోడళ్లున్నారు. పోలీసులు గుర్తించిన 14,190 మందిలో 50% మంది పశ్చిమబెంగాల్‌ వారే. కర్ణాటక వారు 20%, మహారాష్ట్ర నుంచి 15%, ఇతర రాష్ట్రాల వారు12%, విదేశాలకు చెందినవారు 3% మంది ఉన్నారు. డబ్బుతోపాటు కొందరికి మాదకద్రవ్యాలు అలవాటు చేసి ఈ కూపంలోకి దింపుతున్నారు. రష్యా, ఉజ్బెకిస్థాన్‌, థాయిలాండ్‌ యువతుల్ని పర్యాటకవీసా కింద హైదరాబాద్‌కు రప్పిస్తున్నారు. లేదా తెలిసిన వ్యక్తుల్ని పరామర్శించేందుకు వచ్చేలా ఏర్పాటుచేస్తారు. ఈ ముఠా కొందరు యువతుల పేర్లతో నకిలీ ఆధార్‌కార్డులు సైతం సృష్టిస్తోంది.

కార్పొరేట్‌ తరహాలో వ్యవస్థీకృతంగా

నిందితులు వ్యభిచారాన్ని కార్పొరేట్‌ తరహాలో నిర్వహిస్తున్నారు. ఉద్యోగం కోసం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న, విలాసవంతమైన సౌకర్యాలకు అలవాటుపడ్డ యువతుల్ని బ్రోకర్లు మాయమాటలతో నమ్మిస్తారు. వారి ఫొటోలను ప్రధాన నిర్వాహకులు ఉండే వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేస్తారు. వీరిలో కొందర్ని నిర్వాహకులు ఎంపిక చేసి  విమానాల టికెట్లు, స్టార్‌ హోటళ్ల గదులు బుక్‌ చేయించి నగరానికి పంపిస్తారు. విటులు ఉండే గ్రూపులు, కాల్‌గర్ల్స్‌ వెబ్‌సైట్లలో యువతుల ఫొటోలను ఫోన్‌ నంబర్లను ఉంచుతారు. సంప్రదించే విటుల ఫోన్‌ కాల్స్‌ను దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలోని కాల్‌సెంటర్ల సిబ్బంది స్వీకరించి హోటల్‌ వివరాలు, ధర చెప్పి నిర్వాహకుల ఫోన్‌ నంబరు ఇస్తారు. విటుల నుంచి యూపీఐ యాప్‌ల ద్వారా డబ్బు స్వీకరిస్తారు. వచ్చిన సొమ్ములో 30 శాతం యువతికి, 35 శాతం మధ్యవర్తి, కాల్‌సెంటర్‌ సిబ్బందికి ఇచ్చి మిగిలిన మొత్తాన్ని నిర్వాహకుడు తీసుకుంటాడు. ఈ నాలుగేళ్లలో ఒక్కొక్క నిందితుడు రూ.40 లక్షల వరకూ సంపాదించినట్లు పోలీసులు చెప్పారు.  

ఒక్కొక్కరూ వందల మందిని..

అరెస్టయిన నిందితుల్లో ఒక్కొక్కరూ వందల మంది యువతుల్ని వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వివరాలివీ..

* బాలానగర్‌కు చెందిన నడింపల్లి సాయిబాబుగౌడ్‌ (33), ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన యెరసాని జోగేశ్వరరావు 12 ఏళ్లుగా వ్యభిచార గృహం నిర్వహిస్తూ ముంబయి, దిల్లీ, కోల్‌కతాకు చెందిన 2,500 మంది యువతుల్ని వ్యభిచారంలోకి దింపారు.

* సమీర్‌ ముంబయి, కోల్‌కతా, దిల్లీ సహా వివిధ నగరాల నుంచి 850 మంది యువతుల్ని రప్పించి వ్యభిచారం చేయించేవాడు.

* 15 ఏళ్లుగా వ్యభిచార గృహం నిర్వహించే సన్‌సిటీకి చెందిన శైలేంద్రప్రసాద్‌ ఇప్పటివరకూ 1,800 మంది యువతుల్ని మాయమాటలతో రొంపిలో దించాడు. ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.

* యూసుఫ్‌గూడకు చెందిన మహ్మద్‌ అఫ్సర్‌ (42) పదహారేళ్లుగా 1,750 మందిని వృత్తిలో దింపాడు.

* అనంతపురానికి చెందిన పి.గంగాధరి(33) కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. యాప్‌లు, వాట్సప్‌లో యువతుల ఫొటోలు పోస్టు చేస్తాడు. కూకట్‌పల్లి, మాదాపూర్‌ ఠాణాల్లో నమోదైన కేసుల్లో పరారీలో ఉన్నాడు.

* అనంతపురం జిల్లాకు చెందిన మహ్మద్‌ ఫయాజ్‌ (29) టెలీకాలర్‌గా పనిచేస్తూ విటులతో మాట్లాడి ధర నిర్ణయిస్తాడు. వస్త్రాల వ్యాపారం చేస్తున్నట్లు కనిపించే ఇతను కూకట్‌పల్లి, మియాపూర్‌ కేసుల్లో పరారీలో ఉన్నాడు.

* బెంగళూరుకు చెందిన సాయిసుధీర్‌ (27) కాల్‌గర్ల్‌ వెబ్‌సైట్లలో ప్రచార పోస్టర్లు తయారుచేయడంతోపాటు టెలీకాలర్‌గా పనిచేస్తాడు. 850 మందిని వ్యభిచారంలోకి దింపాడు.

* దక్షిణ బెంగళూరుకు చెందిన విష్ణు (39)కు నకిలీ ఆధార్‌ కార్డులు తయారుచేసే వ్యక్తులతో సంబంధాలున్నాయి. 790 మందిని రొంపిలో దింపాడు. ఇతనిపై మాదాపూర్‌లో కేసు నమోదైంది.

* మెహిదీపట్నంలో ఉంటున్న రిషి అలియాస్‌ అబ్దుల్‌ సల్మాన్‌(35) వ్యభిచార నిర్వహణలో ఆరితేరాడు. రష్యా, ఉజ్బెకిస్థాన్‌, వివిధ రాష్ట్రాల నుంచి 900 మందిని రప్పించాడు.

* అమీన్‌పూర్‌కు చెందిన కోడి శ్రీనివాస్‌ (49) ఇళ్లను అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తాడు. ఏపీ, తెలంగాణలకు చెందిన 600 మందిని వ్యభిచారంలోకి దింపాడు.

* గోల్కొండకు చెందిన అలీసామ్‌ (31) కాల్‌గర్ల్‌ వెబ్‌సైట్లలో యువతుల ఫొటోలు ఉంచుతాడు. 700 మంది యువతుల్ని రప్పించిన ఇతనిపై మాదాపూర్‌లో గతంలో ఓ కేసు ఉంది.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని