పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా.. ఆరుగురి మృతి

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లక్ష్మయ్యఊరు సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

Updated : 08 Dec 2022 06:07 IST

24 మందికి గాయాలు  
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లక్ష్మయ్యఊరు సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 24 మందికి గాయాలయ్యాయి. వీరిని చిత్తూరులోని జిల్లా ఆసుపత్రి, వేలూరు సీఎంసీ, తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురిది ఒకే కుటుంబం కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఐరాల మండలం బలిజపల్లెకు చెందిన హేమంత్‌కుమార్‌తో పూతలపట్టు మండలం జెట్టిపల్లెకు చెందిన భువనేశ్వరికి గురువారం ఉదయం జెట్టిపల్లెలో వివాహం జరగనుంది. బలిజపల్లె నుంచి సుమారు 30 మంది ట్రాక్టర్‌లో బుధవారం రాత్రి 8.45 గంటలకు జెట్టిపల్లెకు బయలుదేరారు. లక్ష్మయ్యఊరు సమీపంలో ఎత్తు ప్రాంతం నుంచి దిగుతుండగా.. ఇంధనం ఆదా కోసం ట్రాక్టర్‌ డ్రైవర్‌ సురేందర్‌రెడ్డి ఇంజిన్‌ను ఆపాడు. వేగంగా దూసుకెళ్తున్న వాహనం అదుపు తప్పి ఐదడుగుల గుంతలో పడింది. దీంతో ట్రాక్టరు వెనుక తొట్టెలో ఉన్నవారు ఒకరిపై ఒకరు పడటంతో ఊపిరి ఆడక ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఉన్నారు. చిత్తూరు ఆసుపత్రిలో క్షతగాత్రులను కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిషాంత్‌రెడ్డి, జేసీ వెంకటేశ్వర్‌ పరామర్శించారు.

మృతులు వీరే..

తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లెకు చెందిన తేజశ్రీ (25), ఆమె కుమార్తెలు వినిశ్రీ (3), జెస్సికా(2), ఐరాల మండలం మోటకంపల్లెకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఎ.సురేందర్‌రెడ్డి (52), అదే మండలం బలిజపల్లెకు చెందిన పెళ్లి కుమారుడి పెద్దమ్మ వసంతమ్మ (50), చిత్తూరు నగరంలోని చెందిన మురకంబట్టు అగ్రహారానికి చెందిన కె.రెడ్డెమ్మ (31). ఈమెకు వచ్చే నెలలో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా అంతలోనే ఇలా మృత్యువాత పడడం విషాదకరం.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని