వాట్సప్‌ గ్రూపులతో వ్యభిచార దందా

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా అరెస్టు కేసులో సైబరాబాద్‌ మానవ అక్రమ నిరోధక విభాగం దూకుడు పెంచింది.

Updated : 08 Dec 2022 05:30 IST

ఒక్కో దానిలో 400 మంది సభ్యులు..
మధ్యవర్తులుగా విదేశీయులు.. వేల సంఖ్యలో విటులు
‘అంతర్జాతీయ వ్యభిచార ముఠా’ కేసు విచారణలో సంచలన అంశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా అరెస్టు కేసులో సైబరాబాద్‌ మానవ అక్రమ నిరోధక విభాగం దూకుడు పెంచింది. వ్యభిచార గృహాల నిర్వాహకులు కొందరు నగరాన్ని విడిచివెళ్లినట్టు గుర్తించి ప్రత్యేక బృందాలతో వేటాడుతోంది. మరోవైపు ఇప్పటివరకూ అరెస్టయిన 18 మంది నిందితుల కాల్‌డేటా, నగదు లావాదేవీలను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. కొందరు దిల్లీ, ముంబయి, కోల్‌కతాలో ఉంటూ ఆన్‌లైన్‌ ద్వారా హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించి, వారి కదలికలపైనా నిఘా పెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన యువతుల ఫోన్లలోని వివరాల ఆధారంగానూ కూపీలాగుతున్నారు. ఆయా నగరాల పోలీసు కమిషనర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఐదారుగుర్ని రెండుమూడు రోజుల్లో అరెస్టు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

విటుల్లో ఐటీ ఉద్యోగులే అధికం

ఈ కేసులో విటులపైనా పోలీసులు దృష్టిసారించారు. ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం సహా వివిధ మార్గాల్లో జరిగిన చెల్లింపుల తాలూకూ లావాదేవీలను విశ్లేషించగా.. వేల మంది విటుల సమాచారం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. వీరిలో దాదాపు 60 శాతం మంది ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులున్నట్లు తేలిందని సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వీరిపైనా చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ‘ఏడుగురు ప్రధాన నిందితుల ఫోన్‌లలోని సమాచారం విశ్లేషించినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో దాంట్లో నిర్వాహకులతో కూడిన నాలుగు వాట్సాప్‌ గ్రూపులున్నట్టు గుర్తించాం. ఒక్కో గ్రూపులో గరిష్ఠంగా విదేశాలకు చెందిన 400 మంది  మధ్యవర్తులు ఉన్నారు. విటులను మళ్లీమళ్లీ ఆకర్షించేందుకు గంజాయి, డ్రగ్స్‌ను యువతుల ద్వారా ఇప్పించేవారు. ముంబయికి చెందిన గుడ్డూ అనే వ్యక్తి ద్వారా ఈ ముఠాకు పెద్దయెత్తున మాదకద్రవ్యాలు అందుతున్నాయి. గుడ్డూ.. సోఫిన్‌ పటేల్‌ అలియాస్‌ అబ్బాస్‌ అనే వ్యక్తికి డ్రగ్స్‌ చేరవేస్తుండగా, అతను ఈ ముఠాకు అందజేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది’ అని పోలీస్‌ వర్గాల సమాచారం.

ఆదాయంగా మలచుకున్న హోటళ్ల సిబ్బంది

ఈ కేసులోని నిందితులతో కొందరు హోటళ్లలో మేనేజర్‌ స్థాయి వ్యక్తులు కుమ్మక్కై వ్యభిచారానికి సహకరించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మేనేజర్లు హోటల్‌లోని ఇతర సిబ్బందికి కమీషన్‌ ముట్టజెప్పేవారని, ఎక్కువ మంది వస్తుండడంతో వాళ్లు దీన్నో ఆదాయ వనరుగా మలుచుకున్నారనీ తెలుసుకున్నారు. ‘అరెస్టయిన 18 మంది నిందితుల్లో ఇద్దరు హోటల్‌ మేనేజర్లు ఉండడం దీనికి నిదర్శనం. ఒక్కో యువతి 10 రోజులపాటు హోటల్‌లోనే ఉన్నా, విటులు వచ్చిపోతున్నా సిబ్బంది ఇదేమని ప్రశ్నించేవారు కాదు. పైపెచ్చు వారికి సహకరించేవారు’ అని ఓ అధికారి తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని