ఒకే కుటుంబంలో విషాదం.. ‘ఎల్లరిగడ్డలు’ తినడం వల్లే!

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేటలోని ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.

Updated : 08 Dec 2022 06:05 IST

తల్లీ కుమారుడి మృతి.. అయిదుగురికి అస్వస్థత

కౌడిపల్లి, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేటలోని ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. రెండు రోజుల కిందట ఒకేసారి ఏడుగురు అస్వస్థతకు గురికాగా.. వారిలో బుధవారం కొద్ది గంటల వ్యవధిలో ఇద్దరు (తల్లీ కుమారుడు) మృతి చెందారు. ‘ఎల్లరిగడ్డలు’ (ఓ రకమైన దుంపలు) తిన్న అనంతరం అస్వస్థతకు గురైనట్లు ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబీకులు, పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలం శ్రీనివాస్‌ (50), తల్లి వెంకటమ్మ (70), భార్య లక్ష్మి, కుమారుడు భానుచందర్‌, కోడలు రూపాలి, చిన్నకొడుకు శ్రీకాంత్‌, సోదరి లలిత పొలం నుంచి తెచ్చిన దుంపలను పాలల్లో వేసుకుని ఈ నెల 5న రాత్రి భోజనంతోపాటు తిన్నారు. అర్ధరాత్రి దాటాక వాంతులు, విరేచనాలు కావడంతో మంగళవారం వేకువజామున నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. భానుచందర్‌, శ్రీకాంత్‌, రూపాలి కోలుకోవడంతో ఇంటికి పంపించారు. శ్రీనివాస్‌ బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. పరిస్థితి విషమంగా మారడంతో వెంకటమ్మ, లలితను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలో వెంకటమ్మ మృతిచెందారు. లలిత చికిత్స పొందుతున్నారు. లక్ష్మికి నర్సాపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భానుచందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కౌడిపల్లి పోలీసులు తెలిపారు. కాగా గుండెపోటు రావడంతో శ్రీనివాస్‌ మృతిచెందినట్లు నర్సాపూర్‌ ఆసుపత్రి పర్యవేక్షకుడు నజీర్‌ మిర్జాబేగ్‌ చెప్పారు. కలుషిత ఆహారం తినడం వల్ల వెంకటమ్మ చనిపోయినట్లు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు అనిల్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని