పెదబయలు తహసీల్దారు బలవన్మరణం!

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు తహసీల్దార్‌ శ్రీనివాసరావు(48) గురువారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు.

Updated : 09 Dec 2022 06:17 IST

పని ఒత్తిడి, అధికారుల మందలింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు తహసీల్దార్‌ శ్రీనివాసరావు(48) గురువారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయమే కార్యాలయ సిబ్బందితో అల్పాహారం తెప్పించుకున్న ఆయన, దాన్ని తినకుండానే ఉరేసుకున్నారు. అయితే... తీవ్ర పని ఒత్తిడి, అధికారుల మందలింపు కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన స్థానిక రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... విజయనగరంలో పౌర సరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేసిన శ్రీనివాసరావు పదోన్నతిపై అల్లూరి జిల్లా పెదబయలు తహసీల్దార్‌గా వచ్చారు. తన కార్యాలయం పక్కనే రేకుల షెడ్డులో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య లక్ష్మీశివసరోజా, ఏడాదిన్నర వయసున్న పాప ఉన్నారు. సౌమ్యుడైన ఆయన విధుల్లో నిష్పక్షపాతంగా పనిచేసేవారు. ప్రభుత్వం ప్రారంభించిన భూ సర్వే కారణంగా సమీక్షలు, సమావేశాలతో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. ఇటీవల జిల్లా కేంద్రం పాడేరులో కలెక్టర్‌ ఇదే అంశంపై తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. అందులో శ్రీనివాసరావును ఇద్దరు అధికారులు తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలిసింది. మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఒత్తిడి తట్టుకోవడం కష్టంగా ఉందని, చనిపోతానని తమకు చెప్పారంటూ సహచర సిబ్బంది వాపోయారు. అలాంటి తీవ్ర నిర్ణయాలు తగవని, సెలవుపై వెళ్లాలని తాము సూచించామన్నారు. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడడం వారికి మింగుడుపడలేదు. విషయం తెలుసుకున్న జేసీ శివశ్రీనివాస్‌, పాడేరు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌, ఆర్డీవో దయానిధి పెదబయలు చేరుకున్నారు. పని ఒత్తిడితో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది జేసీకి చెప్పారు. బుధవారమే వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడానని, ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదని జేసీ ఆందోళన వ్యక్తంచేశారు.

తామే పోస్టుమార్టం చేయిస్తామని కుటుంబ సభ్యుల పట్టుదల 

సాయంత్రానికి పెదబయలు చేరుకున్న కుటుంబ సభ్యులు శ్రీనివాసరావు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఉరేసుకున్న షెడ్డు కేవలం ఆరు, ఏడు అడుగులే ఉండటంతో ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయన్నారు. విశాఖ/విజయనగరంలో పోస్టుమార్టం చేయిస్తామని పట్టుబట్టారు. అయితే సంఘటన జరిగిన ఠాణా పరిధిలోనే పోస్టుమార్టం చేయాలని ఎస్పీ సూచించడంతో శాంతించారు. మృతదేహాన్ని పాడేరు తీసుకువెళ్లారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోజ్‌కుమార్‌ తెలిపారు.


నా భర్త మృతిపై అనుమానాలు

-శ్రీనివాస్‌ భార్య లక్ష్మీశివసరోజా

పాడేరు, న్యూస్‌టుడే: నా భర్త మృతిపై అనుమానాలున్నాయి. పని ఒత్తిడైనా కావొచ్చు. ఎవరైనా హత్య చేసి ఉండొచ్చు. పని ఎక్కువగా ఉంటోందని, దిగువ స్థాయి ఉద్యోగులకు అప్పగించిన పనులు సకాలంలో చేయడం లేదని అప్పుడప్పుడు నాతో చెబుతుండేవారు. ఆయనది ఆత్మహత్యకు పాల్పడే మనస్తత్వం కాదు. మా బిడ్డ గురించి ఆలోచించైనా ఇలా చేయరు. చనిపోయే ముందు ఒక్క ఫోన్‌కాల్‌ కూడా చేయలేదు. ఎటువంటి సూసైడ్‌ నోటూ రాయలేదు.


చిన్న పాపే... వదిలి వెళ్లాలని లేదు

విజయనగరం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘పెళ్లి అయిన 15 ఏళ్లకు ఆ భగవంతుడు కరుణించాడు. ఇటీవలే పాప పుట్టింది. ఈలోగా తహసీల్దారుగా ఉద్యోగోన్నతి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే చాలా దూరం. కొండ ప్రాంతాలకు చంటిబిడ్డను తీసుకెళ్లలేను. భార్యాపిల్లలను వదిలి వెళ్లలేను. నా ఆరోగ్యమూ బాగోవడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు’ విజయనగరం జిల్లా నుంచి వెళ్లే ముందు తహసీల్దారు శ్రీనివాసరావు చెప్పిన మాటలివీ. పెదబయలులో ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరావుది విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోపాడ. వారి కుటుంబం విజయనగరంలో స్థిరపడింది. ఆయన తండ్రి రెవెన్యూలోనే ఆర్‌ఐగా పని చేసేవారు. ఆయన మరణంతో శ్రీనివాసరావుకు 2001లో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి జిల్లాలో సీఎస్‌డీటీగా పని చేశారు. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. అప్పుడు ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. జిల్లాల విభజన సమయంలోనే తహసీల్దారుగా ఉద్యోగోన్నతి లభించింది. అన్యమనస్కంగానే పెదబయలు వెళ్లారు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కడికైనా బదిలీ చేయాలని పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈలోగానే ప్రాణాలు వదిలారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని