క్వారీ ప్రమాదంలో యువ దంపతుల మృతి

ప్రేమ కోసం పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు. ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విధి వక్రించి ఇద్దరు బిడ్డలను అనాథలను చేసి వారు తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Published : 09 Dec 2022 05:06 IST

రౌతులపూడి, న్యూస్‌టుడే: ప్రేమ కోసం పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు. ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విధి వక్రించి ఇద్దరు బిడ్డలను అనాథలను చేసి వారు తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. పూరిపాకలో నివసిస్తున్న పేద దంపతులు బహిర్భూమికి గ్రామ శివార్లలోని కొండ ప్రాంతానికి వెళ్లి క్వారీలో రాళ్ల కిందపడి మృతి చెందారు. ఏపీలోని కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాలలో జరిగిన ఈ దుర్ఘటన విషాదాన్ని నింపింది. ప్రమాదంలో పోలోజు వరహాలు (28), లక్ష్మీదుర్గాభవాని (25) కన్నుమూశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం బహిర్భూమికి తన భార్యను వరహాలు ద్విచక్రవాహనంపై గ్రామ శివారుకు తీసుకెళ్లారు. రాత్రయినా వీరు తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు, బంధువులు గాలించారు. ఎస్‌.పైడిపాల-మాతయ్యపేట మార్గంలో వీరి ద్విచక్రవాహనాన్ని గుర్తించారు. సమీపంలోని క్వారీలో పేలుళ్ల కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానించారు. అర్ధరాత్రి నుంచి యంత్రాలతో గాలించారు. గురువారం మధ్యాహ్నానికి మృతదేహాలను వెలికితీశారు. పేలుళ్ల ధాటికి రాళ్లు మీద పడటంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జయ్యాయి. కూలి చేసుకుంటూ వరహాలు, వైఎస్సార్‌ క్రాంతిపథంలో యానిమేటర్‌గా పనిచేస్తూ లక్ష్మీ దుర్గాభవాని జీవిస్తున్నారు. తమ ఆరేళ్ల కుమార్తె సౌజన్య, పది నెలల మరో కుమార్తెను కంటికి రెప్పలుగా చూసుకుంటున్నారు. బహిర్భూమికి వెళ్లే ముందు బుధవారం నిర్వహించే పెద్ద కుమార్తె పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. దంపతుల మరణంతో కుమార్తెలిద్దరూ అనాథలయ్యారు.

అనధికారికం.. తొలి రోజే ప్రమాదం

పదిహేనేళ్ల కిందట మూతపడిన క్వారీని బుధవారమే అనధికారికంగా ప్రారంభించారు. అనుమతి ఉన్న క్వారీలకే పేలుడు పదార్థాలు సరఫరా చేయాలి. ఈ క్వారీకి పేలుడు పదార్థాలు ఎలా చేరాయో, క్వారీకి ఉన్న అనుమతులు ఏమిటన్న విషయమై అధికారులు నోరు తెరవడం లేదు. స్థానిక వైకాపా నాయకులు క్వారీ నిర్వహిస్తుండటం వల్లే అధికారులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ క్వారీ వద్ద స్థానికులు, బంధువులు ఆందోళనకు దిగారు. అనధికారిక క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్వారీ నిర్వహణకు అనుమతులు లేవని తుని గ్రామీణ సీఐ ఏఎస్‌ రావు, తహసీల్దారు ఎల్‌.శివకుమార్‌ ప్రాథమికంగా నిర్ధారించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు