Adibatla Kidnap Case: మందు పార్టీ ఇచ్చి.. అపహరణకు ఉసిగొల్పి
హైదరాబాద్ నగర శివారులోని మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థినిని ‘మిస్టర్ టీ’ ఎండీ నవీన్‌రెడ్డి ప్రణాళిక ప్రకారమే కిడ్నాప్ చేశాడు.
పక్కా ప్రణాళికతోనే బీడీఎస్ విద్యార్థిని కిడ్నాప్
ముందు రోజు రాత్రే వ్యూహరచన
తనిఖీలకు భయపడి మల్లేపల్లిలో విడిచిపెట్టిన నవీన్‌రెడ్డి
32 మంది అరెస్టు
పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు!
ఈనాడు-హైదరాబాద్, ఆదిభట్ల, తుర్కయంజాల్ పురపాలిక-న్యూస్‌టుడే: హైదరాబాద్ నగర శివారులోని మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థినిని ‘మిస్టర్ టీ’ ఎండీ నవీన్‌రెడ్డి ప్రణాళిక ప్రకారమే కిడ్నాప్ చేశాడు. యువతికి నిశ్చితార్థం జరిగే తేదీ గురించి ముందే తెలుసుకున్న నవీన్‌రెడ్డి.. దాన్ని భగ్నం చేసేందుకు గురువారం రాత్రి ప్రణాళిక రచించాడు. ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురంలో ‘మిస్టర్ టీ’ ప్రధాన కార్యాలయంలో మద్యం పార్టీ ఉందంటూ తన టీ బ్రాండ్ ఫ్రాంచైజీ తీసుకున్న యువకులు, అందులో పనిచేసేవారు, స్నేహితుల్ని రప్పించాడు. కొందరు నిరుద్యోగులకు ఫ్రాంచైజీ ఇస్తానంటూ రప్పించాడు. యువతి ఇంటికి చేరుకున్నాక ఏం చేయాలి? కిడ్నాప్ సందర్భంగా ఎవరైనా ఎదురుతిరిగితే ఎలా అడ్డుకోవాలి? ఎలా దాడి చేయాలి? సీసీ ఫుటేజీలను ఎలా ధ్వంసం చేయాలి.. ఇలా అన్నీ వివరించాడు. దాన్నే శుక్రవారం అమలు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తాను ప్రేమించిన యువతిని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం.. పైగా ఆమెకు నిశ్చితార్థం చేస్తుండడంతో ఆగ్రహంతో రగిలిపోయి అపహరణకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.
యువతి కదలికలపై కన్ను
ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో తట్టుకోలేకపోయిన నవీన్‌రెడ్డి.. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. ఆమె ఇంటి సమీపంలో రూ.15 లక్షలతో రెస్టారెంట్ నిర్మించినట్లు తెలిసింది. అక్కడ ఇద్దరు వ్యక్తులను నియమించి ఆమె నిత్యం ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలుసుకునేవాడని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల గుడిలో బీడీఎస్ విద్యార్థిని, తాను పెళ్లి చేసుకున్నామంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో నవీన్‌రెడ్డి కేసు వేశారు. కానీ, ఆ గ్రామంలో ఉన్న ఆలయాల్లో అసలు వివాహాలు జరగవని గ్రామస్థులు చెబుతున్నారు.
గాలింపులు, తనిఖీలతో బెదిరి..
యువతిని కిడ్నాప్ చేసిన అనంతరం పోలీసులు గాలింపులు, తనిఖీలు చేపట్టడంతో బెదిరిపోయిన నవీన్‌రెడ్డి.. ఆమెను ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మల్లేపల్లి వద్ద వదిలేసినట్లు సమాచారం. స్థానికుల సహాయంతో ఆమె తన తండ్రికి ఫోన్ చేసి ‘క్షేమంగా ఉన్నట్లు’ సమాచారమిచ్చింది. ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో అర్ధరాత్రి వేళ ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిసింది. శనివారం ఉదయం బీడీఎస్ కోర్సుకు సంబంధించిన పరీక్ష ఉండటంతో.. ఆమెను షీటీమ్స్ భద్రత నడుమ కళాశాలకు తీసుకెళ్లారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చెప్పారు. శనివారం మన్నెగూడలోని బాధితుల నివాసానికి వెళ్లి పరామర్శించారు.
సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల అరెస్టు
యువతి కిడ్నాప్, ఆమె ఇంట్లో విధ్వంసానికి పాల్పడిన కేసులో 32 మందిని సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. కొందరు నిందితులు నల్గొండ, ఇబ్రహీంపట్నం సహా వివిధ ప్రాంతాలకు పారిపోయారు. మొబైల్ సిగ్నళ్లు, వాహనాల నంబర్ల ఆధారంగా వారిని పోలీసులు పట్టుకున్నారు. నవీన్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శనివారం సాయంత్రం రిమాండుకు తరలించారు. దాడి, అపహరణకు ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్టు పెట్టే అవకాశాలున్నాయి. కాగా, ఈ కేసులో ప్రమేయం లేకున్నా ఇరికించారంటూ యోగేందర్, ముక్రంల కుటుంబీకులు, బంధువులు ఆదిభట్ల ఠాణా వద్ద శనివారం సాయంత్రం ఆందోళన చేశారు.
పెళ్లి జరిగిందని చెప్పాడు: నవీన్‌రెడ్డి తల్లి
అమ్మాయి ఇంటిపైకి గుంపుగా వెళ్లి దాడిచేసి తమ అబ్బాయి తప్పు చేశాడని నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ మీడియాకు తెలిపారు. ‘‘ఆమెను నవీన్ ప్రేమించిన మాట వాస్తవం. మా ఇంటికి వచ్చేది. ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. కరోనా సమయంలో కళాశాలకు కారులో తీసుకెళ్లేవాడు. కొన్ని నెలల క్రితం మనస్పర్థలు వచ్చి దూరమయ్యారు. ఆమెను మరచిపోవాలని.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పినా వినలేదు’’ అని ఆమె చెప్పారు. ఆమె సొమ్మసిల్లి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
గోళ్లతో రక్కారు.. ముఖంపై కొట్టారు: బాధితురాలు
అపహరించిన వ్యక్తులు కారులో తనతో అమానుషంగా ప్రవర్తించారని.. గోళ్లతో రక్కారని, ముఖంపై కొట్టారని వైద్య విద్యార్థిని తెలిపింది. 10 మంది కలిసి దాడి చేశారంది. మాట్లాడితే తన తండ్రిని చంపేస్తామని భయపెట్టారంది. సాయం కోసం కేకలు పెడితే కుడిచేయి వేలు విరగ్గొట్టారని చెప్పింది. ఇష్టం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావంటే ‘‘నువ్వు నాకిష్టం. అందుకే తీసుకొచ్చా. ఇంకొకర్ని ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని నవీన్‌రెడ్డి అన్నాడని చెప్పాడని ఆమె తెలిపింది. ఆమె శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడింది. ‘‘బ్యాడ్మింటన్ శిక్షణకు వెళ్లినప్పుడు నవీన్‌రెడ్డితోపాటు బుచ్చిరెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు తెలిసిన వ్యక్తులున్నారని.. పెళ్లి సంబంధం చూస్తానని బుచ్చిరెడ్డి చెప్పాడు. పెళ్లి చేసుకోవాలంటూ నవీన్ నన్ను సంప్రదించాడు. నేను తిరస్కరించాను. అతని నేపథ్యం తెలిసి మా తల్లిదండ్రులూ నిరాకరించారు. అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. నవీన్‌రెడ్డి సహా కొందరు మా ఇంటి ముందు గొడవ చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. గతేడాది ఆగస్టు 4న మా ఇద్దరికీ పెళ్లి జరిగిందని నవీన్ చెప్పడం అవాస్తవం. ఆ రోజు నేను ఆర్మీ కళాశాలలో దంత చికిత్స కోసం వెళ్లా. అతను మార్ఫింగ్ చేసిన ఫొటోలను చూపిస్తున్నాడు. నా పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి బ్లాక్మెయిల్ చేశాడు. దీనిపై గతంలో కేసు పెట్టాం. స్నేహితులతో తప్ప అతడొక్కడితో ఎక్కడికీ వెళ్లలేదు. కుటుంబంతో కలిసే వెళ్లాను. కారు నామినీగా సంతకం చేయలేదు’’ అని ఆమె స్పష్టంచేశారు. పెళ్లికి అంగీకరించాలంటూ నవీన్‌రెడ్డి తమ అమ్మాయిని బలవంతం చేశాడని యువతి తండ్రి దామోదర్‌రెడ్డి తెలిపారు. తమ ఇంటి సమీపంలో ఏర్పాటు చేయించిన టీ దుకాణం తీసేయాలని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ