GHMC: నకిలీ ధ్రువపత్రాలు.. 100 మీసేవా కేంద్రాలపై కేసు నమోదుకు జీహెచ్‌ఎంసీ సిఫారసు

జీహెచ్‌ఎంసీలో కలకలం రేపిన నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలపై విజిలెన్స్‌ విచారణ ముగిసింది. 100 మీ సేవా కేంద్రాలపై కేసులు నమోదు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 

Published : 21 Mar 2023 23:48 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో కలకలం రేపిన నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలపై విజిలెన్స్‌ విచారణ ముగిసింది. ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి విజిలెన్స్‌ నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్కు అందజేశారు. మొత్తం 400 మీసేవా కేంద్రాల్లో 21వేల నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసినట్టు గుర్తించారు.  40 మీ సేవా కేంద్రాల్లో.. ఒక్కో కేంద్రంలో 100 కంటే ఎక్కువ నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేసినట్టు విజిలెన్స్‌ విచారణలో తేలింది. నివేదికను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ అధికారులు నకిలీ ధ్రువపత్రాలు జారీ చేసిన 100 మీ సేవా కేంద్రాలపై కేసులు నమోదు చేయానలి నిర్ణయించారు. ఈమేరకు కేసులు నమోదు చేయాలని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిఫార్సు చేశారు. గతేడాది మార్చి నుంచి డిసెంబరు మధ్య జారీ అయిన 31,454 ధ్రువపత్రాలను ఇప్పటికే జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. అందులో 27,328 జనన, 4126 మరణ ధ్రువపత్రాలు ఉన్నాయి. 

ఏం జరిగిందంటే..?

అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో.. 2022 ప్రారంభంలో జనన, మరణ ధ్రువపత్రాలకు దరఖాస్తు, ధ్రువపత్రాల ముద్రణ సేవలను జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ‘మీ సేవ’ కేంద్రాలకు బదలాయించింది. లోపభూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు తలెత్తాయి. అవగాహన లేని ఉన్నతాధికారులు ‘ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌’ పేరుతో ప్రవేశపెట్టిన డిజిటల్‌ సేవలు.. నకిలీలకు తావిచ్చాయి. వివరాలు నమోదుచేసి, సరైన పత్రాలను అప్‌లోడ్‌ చేస్తే, సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి సర్టిఫికెట్‌ మంజూరుచేయాలి. అలాంటిదేమీ లేకుండా.. నచ్చిన పేరుతో, నచ్చిన తేదీలో జనన, మరణ ధ్రువపత్రాన్ని తీసుకునే వెసులుబాటును కల్పించడంతో అక్రమార్కులు రెచ్చిపోయారు. నాన్‌ అవెలబులిటీ సర్టిఫికెట్‌, ఆర్డీవో ఉత్తర్వులు, ఇతరత్రా ధ్రువీకరణ ప్రతాలకు బదులు తెల్లకాగితాలు, చిత్తు పేపర్లను సమర్పించి.. పాత తేదీలతో జనన, మరణ ధ్రువపత్రాలను సృష్టించారు. అవకాశం ఎప్పుడు చేజారుతుందోనని.. ముషీరాబాద్‌, చార్మినార్‌, మెహిదీపట్నం, ఇతరత్రా ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు మీసేవ కేంద్రాలవారు. రేయింబవళ్లు ఆయా కేంద్రాలను నడిపించారంటే పరిస్థితి ఎంత దారుణానికి దారితీసిందో అర్థం చేసుకోవచ్చు. 40, 50 ఏళ్ల కిందటి తేదీలతోనూ జనన ధ్రువపత్రాలు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని