Chhattisgarh: 17ఏళ్ల బాలికపై అమానుషం: జుట్టు పట్టుకొని.. నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

ఓ మైనర్‌ బాలిక (Minor Girl)ను దాదాపు 47 ఏళ్ల వయసున్న వ్యక్తి నడిరోడ్డుపై జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.

Published : 20 Feb 2023 01:33 IST

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని రాయ్‌పూర్‌ (Raipur)లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్‌ బాలికను దాదాపు 47 ఏళ్ల వయస్సున్న వ్యక్తి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. నిందితుడు తన చేతిలో పదునైన ఆయుధంతో ఆమెను గాయపరిచినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యల్లో వైరల్‌గా మారింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. పోలీసులు కలగజేసుకొని నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... రాయ్‌పూర్‌లోని గుఢియారీ ప్రాంతంలో ఓంకార్‌ తివారీ అలియాస్‌ మనోజ్‌ అనే వ్యక్తి ఓ దుకాణం నడుపుతున్నాడు. గత కొన్నాళ్లుగా బాధిత బాలిక అందులోనే పని చేస్తోంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడు ఆమెపై ఒత్తిడి చేయగా.. అందుకు బాలికతోపాటు, ఆమె తల్లి నిరాకరించారు. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు అదును చూసి బాలికపై దాడికి దిగాడు. ఆమెను గాయపరిచి.. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు.

ఈ తతంగాన్ని కొందరు వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలికను చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె కోలుకున్న తర్వాత ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని రాయ్‌పూర్‌ సీనియర్‌ ఎస్పీ ప్రశాంత్‌ అగర్వాల్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని