
Crime news: కుక్కను కాపాడబోయి.. 9వ అంతస్తు పైనుంచి పడిపోయి బాలిక మృతి
ఘజియాబాద్: పెంపుడు శునకాన్ని కాపాడబోయిన ఓ బాలిక ప్రమాదవశాత్తూ బాల్కనీ పైనుంచి కిందపడి మృతిచెందింది. ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన ఓ కుటుంబం స్థానిక గౌర్ హోమ్ హౌసింగ్ సొసైటీలోని 9వ అంతస్తులో నివాసముంటోంది. ఏడో తరగతి చదువుతున్న వారి కుమార్తె జ్యోత్స్న (12) బుధవారం మధ్యాహ్నం తమ పెంపుడు శునకంతో ఇంట్లో ఆడుకుంటోంది. బాల్కనీలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన శునకం అక్కడే ఉన్న నెట్ (వల)లో చిక్కుకుంది. దాని వెనకాలే వచ్చిన జ్యోత్స్న వలలో నుంచి కుక్కను బయటకు తీసేందుకు ప్రయత్నించింది. అయితే ప్రమాదవశాత్తూ శునకంతో సహా 9వ అంతస్తు నుంచి పడిపోయింది.
బయట అరుపులు విన్న తల్లి బాల్కనీలోకి వచ్చి చూడగా.. కుమార్తె రక్తపు మడుగులో పడిపోయి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో జ్యోత్స్నతో పాటు కిందపడ్డ శునకం కూడా మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.