Crime news: పాఠశాల వాష్‌రూమ్‌లో విద్యార్థినిపై దారుణం.. సీనియర్లే నిందితులు!

దిల్లీలోని ఓ కేంద్రీయ విద్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక పట్ల ఈ ఘోరానికి పాల్పడింది సీనియర్‌ విద్యార్థులే కావడం గమనార్హం.

Updated : 06 Oct 2022 22:17 IST

డీసీడబ్ల్యూ నోటీసులు.. విచారణకు కేవీఎస్‌ ఆదేశం

దిల్లీ: దేశ రాజధానిలో  11 ఏళ్ల బాలికపై దారుణం జరిగింది. దిల్లీలోని ఓ కేంద్రీయ విద్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక పట్ల ఈ ఘోరానికి పాల్పడింది సీనియర్‌ విద్యార్థులే కావడం గమనార్హం. వాస్తవానికి ఈ ఘటన జులైలోనే జరగ్గా.. దిల్లీ మహిళా కమిషన్‌(DCW) చొరవతో బాధితురాలు మంగళవారం పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. మరోవైపు, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(KVS) ప్రాంతీయ కార్యాలయం కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది. 

టాయిలెట్‌లోకి లాక్కెళ్లి ఘోరం..

ఈ ఘటనపై డీసీడబ్ల్యూ తెలిపిన వివరాల ప్రకారం.. జులైలో బాధితురాలు తరగతి గదికి  వెళ్తున్న క్రమంలో యాదృచ్చికంగా  11, 12 తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది. ఆపై తాను క్షమాపణలు చెప్పినా వారు దూషించారని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత తనను  బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి  సామూహిక అత్యాచారం చేశారని బాలిక వాపోయింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలికి చెప్పినా  పట్టించుకోలేదని,  వారిని  బహిష్కరించినట్టు చెప్పి ఊరుకున్నారని బాలిక చెప్పినట్టు కమిషన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, పాఠశాల అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు  అందలేదని కేవీఎస్‌ అధికారులు తెలిపారు. ప్రాంతీయ కార్యాలయం దీనిపై దర్యాప్తు చేస్తోందన్నారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయలేదని.. ఈ ఘటన తర్వాత జరిగిన టీచర్లు- తల్లిదండ్రుల సమావేశంలోనూ తమ దృష్టికి తీసుకురాలేదని  పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తు తర్వాతే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దిల్లీ పోలీసుల దర్యాప్తునకు తాము సహకరిస్తామని కేవీఎస్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని.. బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా బోధనా సిబ్బంది, అనుమానిత విద్యార్థులను విచారించినట్టు పోలీసులు వెల్లడించారు. 

పాఠశాలలూ సురక్షితం కాకపోవడం దురదృష్టకరం..

‘‘దిల్లీలోని కేంద్రీయ విద్యాలయం పాఠశాలలో 11 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చాలా తీవ్రమైనది. తన స్కూల్ టీచర్ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారని బాలిక ఆరోపిస్తోంది. రాజధానిలో పిల్లలకు పాఠశాలలు కూడా సురక్షితం కాకపోవడం చాలా దురదృష్టకరం’’ అని డీసీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ అన్నారు. ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. పాఠశాల అధికారుల పాత్రపైనా విచారణ జరిపించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని