Madhya Pradesh rape: ఆటోలో రక్తపు మరకలు.. సాయం కోసం 8 కి.మీ: మధ్యప్రదేశ్‌ రేప్‌ ఘటనలో మరిన్ని విషయాలు

Madhya Pradesh rape: మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన అమానవీయ ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణానికి సంబంధించి పోలీసులు ఓ ఆటోడ్రైవర్‌తో సహా మరికొందరిని అరెస్టు చేశారు. 

Published : 28 Sep 2023 12:56 IST

భోపాల్‌: అత్యాచారానికి గురై.. నడివీధిలో అర్ధనగ్నంగా రక్తమోడుతూ ఓ బాలిక సాయం కోరిన దృశ్యాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరైనా సాయం చేయకపోతారా అని.. ఆమె ఎనిమిది కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. బాలిక దుస్థితి అందరిని కలచివేస్తోంది. ఈ ఘటనపై ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్‌నగర్‌ రోడ్డులోని ఆశ్రమ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాదు.. అధికారులు వచ్చేలోపు బాలికను ఆదుకున్నారు. (Madhya Pradesh rape)

ఆశ్రమ సిబ్బందిలో ఒకరైన రాహుల్‌ శర్మ ఆ బాలిక పరిస్థితిని వివరించారు. ‘‘సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఓ పనిమీద ఆశ్రమం నుంచి బయటకు వచ్చాను. అప్పుడే ఆశ్రమానికి సమీపంలో ఈ బాలిక కనిపించింది. గేటు వద్ద రక్తమోడుతూ అర్ధనగ్న స్థితిలో ఉంది. వెంటనే ఆమెకు నా వద్ద ఉన్న దుస్తులు ఇచ్చాను. ఆమె ఏమీ మాట్లాడలేకపోతోంది. కళ్లు వాచిపోయి ఉన్నాయి. వెంటనే 100కు డయల్ చేసినా.. కలవలేదు. అనంతరం మహాకాల్‌ పోలీసు స్టేషన్‌కు ఫోన్‌ చేసి విషయం తెలియజేశాను. కొద్దిసేపటికి పోలీసులు వచ్చారు’’ అని తెలిపారు. 

బాలికకు నరకం చూపించిన ఆర్మీ అధికారి దంపతుల అరెస్ట్‌

‘‘ఆ బాలిక మాతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ, మాకు ఆమె మాటలు అర్థం కాలేదు. మేం ఆమె పేరు అడిగాం. ‘నీకేం కాదు.. మీ కుటుంబం గురించి చెప్పు. వారికి ఈ విషయం చెప్తాం’ అని ధైర్యం చెప్పాం. ఆమె ఒక ప్రాంతం గురించి చెప్పింది. కానీ.. మాకు అర్థం కాలేదు. అప్పటికే ఆ బాలిక వణికిపోతోంది. ఆ కొంచెం సమయంలో ఆమె నన్ను నమ్మింది. ఎవరైనా ఆమె వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తే.. నా వెనుకకు వచ్చి దాక్కుంటోంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు’ అని శర్మ వెల్లడించారు. 

ఆటోలో రక్తపు మరకలు..

దుండగుల చేతిలో అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా రోడ్డుపై తిరుగుతూ.. దారిలో ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టినా ఒక్కరూ ఆదుకోలేదు. బుధవారం ఈ ఘటన దృశ్యాలు వెలుగులోకి రాగా.. స్థానికులు ప్రవర్తన అందరిని కలచివేసింది. తర్వాత ఆశ్రమం నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు.  బాలిక ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నా.. ప్రస్తుతానికి ప్రమాదం లేదని ఓ అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై మహాకాల్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసినట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్ర వెల్లడించారు.

ఈ ఘటనలో ఇప్పటికే ఆటో డ్రైవర్‌తో సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు జీవన్‌ ఖేరీ ప్రాంతంలో ఆటో ఎక్కిందని, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ లభించింది. ఆ ఆటోలో రక్తపు మరకలు గుర్తించామని, వీటిని ఫొరెన్సిక్‌ నిపుణులు పరీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని