Goa rape case: మీ పిల్లలు మాటవినకపోతే.. పోలీసుల్ని అనలేం..! 

ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.

Updated : 29 Jul 2021 13:53 IST

వివాదాస్పదంగా మారిన గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు

పనాజీ: ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అర్ధరాత్రి వేళ పిల్లలు బయటకు వెళ్లడానికి అనుమతించడంపై అసెంబ్లీ వేదికగా ఆయన వారి తల్లిదండ్రుల్ని నిందించారు. దాంతో ఆయన వైఖరిని విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. 

‘పదిమంది పిల్లలు బీచ్‌లో పార్టీ చేసుకున్నారు. వారిలో ఆరుగురు తిరిగొచ్చారు. ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు మాత్రం ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. 14 ఏళ్ల పిల్లలు అక్కడ ఉన్నారంటే వారి తల్లిదండ్రులు దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు జాగ్రత్త వహించాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేదని..ఆ బాధ్యతనంతా పోలీసులపై వదిలేయలేం’ అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. రాత్రిపూట ఆడపిల్లలు బయటకు వెళ్లడానికి అనుమతించరాదని, మరీ ముఖ్యంగా వారు మైనర్లుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలంటూ హితవు పలికారు. 

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. ‘రాత్రుళ్లు తిరిగేందుకు ఎందుకు భయపడాలి. నేరస్థులు జైల్లో ఉండాలి. చట్టాన్ని గౌరవించేవారు స్వేచ్ఛగా తిరిగేలా ఉండాలి’ అంటూ విరుచుకుపడింది. దీనిపై రణ్‌దీప్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా స్పందిస్తూ..‘ఆ ప్రవర్తన కోసం ముఖ్యమంత్రి తన పదవి నుంచి వైదొలిగి, ఇంటికి వెళ్లాలి’ అంటూ మండిపడ్డారు. జులై 24న పనాజీకి 30 కిలోమీటర్ల దూరంలోని కోవ్లా బీచ్‌లో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. వారి వెంట ఉన్న ఇద్దరు బాలురు దాడికి గురయ్యారు. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు