IGI Airport: విమానం టాయ్‌లెట్‌లో రూ.2 కోట్ల బంగారం..!

విమానం టాయ్‌లెట్‌లో దాచి ఉంచి, అక్రమంగా తరలిస్తోన్న సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం కడ్డీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో ఇది వెలుగుచూసింది.

Published : 05 Mar 2023 18:35 IST

దిల్లీ: కొంతమంది ప్రయాణికులు తమతోపాటు బంగారం, నగదు, ఇతరత్రా సామగ్రిని అక్రమంగా తరలించేందుకు ఎన్నెన్నో అడ్డదారులు తొక్కుతుంటారు. ఈ క్రమంలోనే విమానాశ్రయాల్లో తనిఖీల సందర్భంగా పట్టుబడుతుంటారు. అయితే, తాజాగా ఓ విమానం టాయ్‌లెట్‌లోనే పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. దిల్లీ(Delhi)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI Airport)లో ఈ ఘటన వెలుగుచూసింది. విమానం టాయ్‌లెట్‌లో దాచి ఉంచిన సుమారు రూ.2 కోట్ల విలువైన నాలుగు బంగారు కడ్డీ(Gold Bars)లను కస్టమ్స్ అధికారులు(Customs) స్వాధీనం చేసుకున్నారు.

విదేశాల నుంచి వచ్చిన ఓ విమానంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. టర్మినల్‌- 2 లోని ఆ విమానంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే వాష్‌రూమ్‌లోని సింక్‌ కింద టేప్‌తో అతికించిన ఓ పర్సును గుర్తించారు. అందులో 3969 గ్రాముల బరువున్న నాలుగు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లుగా ఉంటుందని ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. కేసు నమోదు చేసుకుని.. ఎవరు? ఎక్కడి నుంచి తరలిస్తున్నారో? గుర్తించే దిశగా దర్యాప్తు చేస్తోన్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని