Fake Death: తనలాగే ఉన్న యువతిని చంపి.. తానే చనిపోయినట్లు చిత్రీకరించి!

తనలాగే పోలికలు ఉన్న మరో యువతిని హత్యచేసి.. తానే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి, అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయిందో యువతి. తీరా.. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు గుట్టు బయటపడింది.

Published : 03 Dec 2022 06:39 IST

దిల్లీ: తనలాగే పోలికలు ఉన్న మరో యువతిని హత్యచేసి.. తానే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి, అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయిందో యువతి. తీరా.. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు గుట్టు బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నోయిడాకు చెందిన పాయల్‌ భాటి(22), ఆమె ప్రియుడు అజయ్‌ ఠాకూర్‌తో కలిసి.. పాయల్‌లాగే కనిపించే, స్థానికంగా ఓ మాల్‌లో పనిచేసే హేమతో స్నేహం చేశారు. పథకం ప్రకారం ఇటీవల ఆమెను ఇంటికి పిలిచిన పాయల్‌.. ప్రియుడితో కలిసి ఆమె గొంతు నులిమి హత్య చేసింది.

ముఖం, గొంతు నులిమిన ఆనవాళ్లు కనిపించకుండా వేడి నూనె పోసింది. చేతికి గాట్లు పెట్టి, మృతదేహానికి తన దుస్తులు తొడిగింది. ఆపై.. తనే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తూ.. ‘వంట చేస్తుండగా.. నా ముఖం కాలిపోయింది. నాకింక బతకాలని లేదు’ అని ఓ సూసైడ్‌ నోట్‌ రాసింది. అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయింది. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా.. ఆమెను పాయల్‌గానే భావించిన బంధువులు.. అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు.. చనిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదంటూ నవంబర్‌ 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు.. దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసింది.

ఈ క్రమంలోనే నిందితులిద్దరిని అరెస్టు చేశారు. పాయల్ తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ‘తన తల్లిదండ్రుల మరణానికి సోదరుడి అత్తింటివారితోపాటు ఓ బంధువు కారణమని పాయల్‌ భావించింది. ఈ క్రమంలో.. వారిని చంపాలని నిర్ణయించింది. పథకం ప్రకారం.. ముందుగా తను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది. తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయింది. అనంతరం వారిని హత్య చేసేందుకు.. నాటు తుపాకీ, కత్తి సైతం కొనుగోలు చేశారు’ అని పోలీసులు వెల్లడించారు. మారణాయుధాలనూ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని