Telangana News: బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు.. రూ.43లక్షలు కొట్టేశారు..

సిద్దిపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. వ్యక్తిపై ఓ 

Published : 01 Feb 2022 01:29 IST

సిద్దిపేట టౌన్‌: సిద్దిపేట అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం సమీపంలో కాల్పుల కలకలం రేగింది. ఓ వ్యక్తి స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు కార్యాలయానికి రాగా ఈ క్రమంలోనే కారులో డ్రైవర్‌ వద్ద ఉన్న రూ.43.50లక్షల నగదును ఇద్దరు దుండగులు దోచుకెళ్లారు. కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి నగదుతో ఉడాయించారు. వివరాల్లోకి  వెళితే.. దొమ్మాట మాజీ సర్పంచ్‌, సిద్దిపేటకు చెందిన స్తిరాస్థి వ్యాపారి నర్సయ్య తనకు చెందిన స్థలాన్ని సిద్దిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్‌ రెడ్డికి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు రూ.64.24లక్షలు చెల్లించేందుకు వారి మధ్య ఒప్పందం జరిగింది.

సోమవారం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా సిద్దిపేట కార్యాలయానికి వారివురూ వచ్చారు. ఈ క్రమంలో కొనుగోలుదారు రూ.43.50లక్షల నగదును నర్సయ్యకు అప్పగించారు. నర్సయ్య ఆ మొత్తాన్ని తన కారు డ్రైవర్‌ పరశురామ్‌కు అప్పగించి కారులోనే కూర్చోమని చెప్పి ఆయన రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోనికి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో డ్రైవర్‌ అప్రమత్తమై కారు ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తుపాకీతో డ్రైవర్‌ ఎడమ కాలిపై కాల్చగా.. ఆ వెంటనే మరో వ్యక్తి పక్క సీట్‌లో ఉన్న నగదు సంచిని తీసుకుని ఉడాయించారు. గాయపడిన డ్రైవర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసు కమిషనర్‌ శ్వేత అక్కడికి చేరుకొని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని