Guntakal: గుంతకల్లు రైల్వేలో అవినీతి అనకొండలు

గుత్తేదారులను లంచాల కోసం వేధించిన గుంతకల్లు రైల్వే డివిజన్‌ ఉన్నతాధికారులను సీబీఐ శనివారం అరెస్టు చేసింది.

Updated : 07 Jul 2024 06:50 IST

డీఆర్‌ఎం, డీఎఫ్‌ఎం, మరో ముగ్గురు ఉద్యోగుల అరెస్టు
కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న సీబీఐ
డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ ఇంట్లో నగదు, బంగారం స్వాధీనం?

డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ను తీసుకెళ్తున్న సీబీఐ అధికారులు

ఈనాడు డిజిటల్‌ - అనంతపురం, న్యూస్‌టుడే - గుంతకల్లు: గుత్తేదారులను లంచాల కోసం వేధించిన గుంతకల్లు రైల్వే డివిజన్‌ ఉన్నతాధికారులను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. టెండర్ల ద్వారా రైల్వే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు అంగీకార ఉత్తర్వులు ఇవ్వడానికి లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలు రావడంతో గురు, శుక్రవారాల్లో డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) వినీత్‌సింగ్, సీనియర్‌ డివిజినల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ (డీఎఫ్‌ఎం) ప్రదీప్‌బాబు, సీనియర్‌ డివిజన్‌ ఇంజినీర్‌ అక్కిరెడ్డి ఇళ్లలో సీబీఐ డీఎస్పీ జై కుమార్‌ భారతీయ నేతృత్వంలో అధికారులు సోదాలు నిర్వహించారు. డీఆర్‌ఎం, ఆర్థిక విభాగం కార్యాలయాల్లో దస్త్రాలను పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి వినీత్‌సింగ్, ప్రదీప్‌బాబు, అక్కిరెడ్డి, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ ఎం.బాలాజీ, అకౌంట్‌ అసిస్టెంట్‌ డి.లక్ష్మీపతిరాజులతోపాటు గుత్తేదారులు కుప్పం రమేశ్‌కుమార్‌రెడ్డి, ఎన్‌.రహమతుల్లాను అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం వరకు డివిజన్‌ కార్యాలయంలోనే వీరిని విచారించారు. అనంతరం నిందితులను కర్నూలు సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో కర్నూలులోని జిల్లా జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో సీబీఐ మొత్తం 13 మందిపై కేసు నమోదు చేయగా.. అందులో ఐదుగురు రైల్వే ఉద్యోగులు,   8 మంది ప్రైవేటు వ్యక్తులు. వీరిలో ఇంకా ఆరుగురిని అరెస్టుచేయాల్సి ఉంది.

సీబీఐకి పట్టుబడిన ఇంజినీరింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌ బాలాజీ

రూ.20 లక్షల డిమాండ్‌

రైల్వే పనుల టెండర్లు దక్కించుకున్న గుత్తేదార్లకు అంగీకార ఉత్తర్వులు ఇవ్వడానికి కిందిస్థాయి ఉద్యోగులతోపాటు డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ పెద్ద మొత్తంలో లంచాలు పుచ్చుకున్నారని సీబీఐ గుర్తించింది. కాంట్రాక్టు విలువలో 0.5 శాతాన్ని బంగారం రూపంలో ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు విచారణలో తేలింది. గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలో ధర్మవరం- పాకాల, గుత్తి- రేణిగుంట సెక్షన్లలో వంతెనల నిర్మాణ పనులను కొందరు గుత్తేదారులు దక్కించుకున్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నుంచి బెంగళూరుకు చెందిన రమేశ్‌కుమార్‌రెడ్డి సబ్‌ కాంట్రాక్టు తీసుకున్నారు. పనుల అంగీకార ఉత్తర్వుల కోసం రమేశ్‌కుమార్‌రెడ్డి నుంచి సీనియర్‌ డీఎఫ్‌ఎం ప్రదీప్‌బాబు, సీనియర్‌ డివిజన్‌ ఇంజినీర్‌ అక్కిరెడ్డి మరికొందరు ఉద్యోగులు డబ్బులు డిమాండ్‌ చేశారు. డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌కూ వాటాలివ్వాలని చెప్పారు. అక్కిరెడ్డి రమేశ్‌కుమార్‌రెడ్డిని రూ.20 లక్షలు డిమాండ్‌ చేశారు. మరికొందరు గుత్తేదారుల నుంచి కూడా అధికారులు లంచాలు డిమాండ్‌ చేశారు. మొదట రూ.11 లక్షలు ఇస్తానని అంగీకరించిన రమేశ్‌కుమార్‌రెడ్డి దీనిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ అధికారులు ఈ నెల 3న గుంతకల్లుకు వచ్చి ఆర్థిక విభాగంలోని పలువురు సిబ్బందిని కలిశారు. తమను రైల్వే కాంట్రాక్టర్లుగా పరిచయం చేసుకుని కూపీ లాగినట్లు తెలుస్తోంది. 4న సాయంత్రం రమేశ్‌కుమార్‌రెడ్డి డీఎఫ్‌ఎం ప్రదీప్‌బాబుకు రూ.11 లక్షలు లంచం ఇస్తుండగా నేరుగా పట్టుకున్నారు. ప్రదీప్‌బాబును అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయన నేరం అంగీకరించడంతో డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. డీఆర్‌ఎం ఇంట్లో నగదు, కొంత బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

రూ.350 కోట్ల పనులు

గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకుంటూ ఓ రైల్వే డీఆర్‌ఎం దొరికిపోవడం గుంతకల్లు డివిజన్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. గతిశక్తి విభాగం ఆధ్వర్యంలో డివిజన్‌లో రూ.350 కోట్లకు పైన విలువైన వంతెనల నిర్మాణం, స్టేషన్‌ భవనాల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. జనవరిలో వినీత్‌సింగ్‌ ఇక్కడ డీఆర్‌ఎంగా బాధ్యతలు చేపట్టారు. అడిగినంత డబ్బులివ్వలేదని పలువురు గుత్తేదార్ల పనుల్ని పెండింగ్‌లో పెట్టారని, లంచాల సొమ్మును దాచడానికి కార్యాలయంలోని కొందరు సిబ్బందిని బినామీలుగా మార్చుకున్నారని సీబీఐ విచారణలో తేలినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని