Crime news: కారులో లిఫ్ట్‌ ఇస్తానని.. అసభ్యకరంగా తాకాడు: మహిళా ప్రొఫెసర్‌ ఫిర్యాదు

కారులో లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి తోటి అధ్యాపకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో ప్రొఫెసర్‌. ఈ ఘటన గురుగ్రామ్‌ సెక్టార్‌ 9లోని ప్రభుత్వ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది.

Published : 03 Dec 2022 01:17 IST

గురుగ్రామ్‌: కారులో లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి తోటి అధ్యాపకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో ప్రొఫెసర్‌. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌ సెక్టార్‌ 9లోని ఓ ప్రభుత్వ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. తోటి అధ్యాపకుడు తనను లైంగికంగా వేధించినట్టు మహిళా ప్రొఫెసర్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 35 ఏళ్ల మహిళా ప్రొఫెసర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కళాశాలలో గత వారం రోజులుగా యూత్‌ ఫెస్టివల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి 7.30గంటల సమయంలో రిహార్సల్స్‌ ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు మహిళా అధ్యాపకురాలు బయల్దేరారు. ఆమె కారు పార్కింగ్‌ లాట్‌లో ఉండటంతో రవి దేశ్వాల్‌ అనే ప్రొఫెసర్‌ తన కారులో అక్కడి వరకు డ్రాప్‌ చేస్తానని చెప్పాడు. దీంతో కారెక్కి కూర్చోగానే తనను అనుచితంగా టచ్‌ చేస్తూ.. అసభ్యపదజాలం ఉపయోగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే కారులోంచి బయటకు వచ్చి కేకలు వేయడంతో అక్కడే ఉన్న విద్యార్థులు, మరికొందరు అక్కడికి చేరుకుంటుండంతో అతడు కారులో పారిపోయాడని ఆమె వివరించారు.  గురువారం రాత్రి మహిళా ప్రొఫెసర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవి దేశ్వాల్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం వైద్య పరీక్షల అనంతరం మహిళా ప్రొఫెసర్‌ను సిటీ కోర్టులో హాజరు పరిచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు సెక్టార్‌ 9 పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని