Crime News: పట్టాలు తప్పిన బికనేర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. ఐదుగురి మృతి

బెంగాల్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జల్పాయిగురి జిల్లాలో బికనేర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది.......

Updated : 13 Jan 2022 20:25 IST

కోల్‌కతా: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జల్పాయిగురి జిల్లాలో బికనేర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. దాదాపు 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 45మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని బికనేర్‌ నుంచి నిన్న బయల్దేరిన ఈ రైలు పట్నా మీదుగా అసోంలోని గువాహటికి వెళ్తుండగా బెంగాల్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రైలు సాయంత్రం గువాహటికి చేరుకోవాల్సి ఉంది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.

మృతులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియో

ఈ దుర్ఘటనపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. ఈ ఘటన గురించి, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ప్రధాని మోదీకి వివరించినట్టు చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు, ఘటనలో మృతులకు రూ.5లక్షల చొప్పున భారతీయ రైల్వే ప్రకటించింది. అలాగే, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేలు చొప్పున సాయంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఘటనా స్థలానికి శుక్రవారం ఉదయం వెళ్లనున్నట్టు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. వైద్య బృందాలు, సీనియర్‌ అధికారులు ఇప్పటికే చేరుకున్నారని చెప్పారు. 

మోదీ విచారం

రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఈ ప్రమాదంలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని