Andhra news: నిష్పక్షపాతంగా విచారణ చేపట్టండి: హైకోర్టు

పశ్చిమగోదావరి జిల్లా మలకపల్లి గ్రామానికి చెందిన యువకుడు గెడ్డం శ్రీను మృతి కేసులో నిష్ణాతులైన వైద్యులతో తిరిగి శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

Published : 24 Mar 2022 01:21 IST

విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా మలకపల్లి గ్రామానికి చెందిన యువకుడు గెడ్డం శ్రీను మృతి కేసులో నిష్ణాతులైన వైద్యులతో తిరిగి శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గెడ్డెం శ్రీను మృతి కేసులో అతడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. 30 రోజుల్లోపు విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించినా.. పోలీసులు పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ కారణాలతో విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని, కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని వాదనలు వినిపించారు. ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు హత్య కేసుగా తిరిగి నమోదు చేసినప్పటికీ ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదన్నారు. ఆత్మహత్య అంటూ కేసును మూసివేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అటు మృతుడు పురుగు మందు తాగి చనిపోయాడని, అతడిది హత్య అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. నిప్షక్షపాతంగా విచారణ చేయాలని డీజీపీకి సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని