కుప్పకూలిన హెలికాప్టర్‌.. శిక్షకుడి మృతి

మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో ఓ శిక్షణ హెలికాప్టర్‌ కూలిపోయి శిక్షకుడు మృతిచెందాడు. శిక్షణలో ఉన్న పైలట్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. వార్దీ గ్రామంలోని ఓ నిర్జర ప్రదేశంలో కూలడంతో స్థానికులకు ఎలాంటి హాని జరగలేదు....

Published : 16 Jul 2021 22:33 IST

ముంబయి: మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో ఓ శిక్షణ హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటనలో శిక్షకుడు మృతిచెందాడు. శిక్షణలో ఉన్న పైలట్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. వార్దీ గ్రామంలోని ఓ నిర్జన ప్రదేశంలో కూలడంతో స్థానికులకు ఎలాంటి హానీ జరగలేదు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే శిక్షకుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ శిక్షణలో ఉన్న పైలట్‌ చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఎన్‌ఎంఐఎంఎస్‌ శిక్షణ కేంద్రానికి చెందిన హెలికాప్టర్‌గా దాన్ని గుర్తించారు.

ఈ దుర్ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌ కూలిన దుర్ఘటన వార్త విని షాక్‌కు గురైనట్లు తెలిపారు. ఓ దర్యాప్తు బృందాన్ని ఘటనా ప్రాంతానికి తరలించినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చికిత్స పొందుతున్న శిక్షణ పైలట్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని