ఏడాదిన్నర పాపపై అత్యాచారం

ఏడాదిన్నర వయసున్న పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఊహ కూడా తెలియని ఆ చిన్నారి మరణానికి కారకుడయ్యాడు.

Published : 23 Jun 2021 01:27 IST

బహ్రాయిచ్: ఏడాదిన్నర వయసున్న పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఊహ కూడా తెలియని ఆ చిన్నారి మరణానికి కారకుడయ్యాడు. హృదయ విదారకమైన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏడాదిన్నర వయసున్న చిన్నారి సోమవారం రాత్రి తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. ముప్పయ్యేళ్ల వయసున్న నిందితుడు ఆమెను ఎత్తుకెళ్లాడు. సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న పాఠశాల భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం నిద్ర లేవగానే తమ కుమార్తె కనిపించకపోవడంతో చిన్నారి అమ్మానాన్నల్లో ఆందోళన మొదలైంది. గ్రామస్థులతో కలిసి పాపకోసం వెతకడం ప్రారంభించారు. సమీపంలోని పాఠశాల భవనంలో తీవ్ర రక్తస్రావంతో అచేతనంగా పడి ఉన్న చిన్నారిని కనుగొన్నారు. కూతురిని ఇలాంటి దారుణ స్థితిలో చూడాల్సివస్తుందనుకోలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అక్కడే ఉన్న నిందితుడిని పట్టుకొని గ్రామస్థులు చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. అత్యాచారానికి గురైన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఆ పసిపాప ప్రాణాలు కోల్పోయింది.  

పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా.. అతడు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని లొంగిపొమ్మని హెచ్చరిస్తూ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా పరుగు ఆపకపోవడంతో తుపాకీతో కాల్చారు. నిందితుడి కాలికి గాయమైంది. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని