Warangal: ఉన్మాదిగా మారిన యువకుడు.. ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు దంపతుల దారుణ హత్య

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారుచింతలతండాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యాభర్తల గొంతుకోసి దారుణహత్యకు పాల్పడ్డాడు. 

Updated : 11 Jul 2024 11:35 IST

నర్సంపేట: వరంగల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు ఓ యువకుడు ఉన్మాదిగా మారి యువతి తల్లిదండ్రులను హతమార్చాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బానోతు శ్రీనివాస్‌(45), బానోతు సుగుణ (40) దంపతులు పదహారు చింతల తండాలో నివాసముంటున్నారు. వారి కుమార్తె దీపికను గుండెంగ గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు గత నవంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆ యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ హనుమకొండలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. 

తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారంతో బన్నీ ఉన్మాదిగా మారాడు. గురువారం తెల్లవారుజామున పదునైన ఆయుధంతో ఇంటి ముందు నిద్రిస్తున్న శ్రీనివాస్‌, సుగుణ దంపతులపై దాడికి పాల్పడ్డాడు. సుగుణ అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. ఈ ఘటనలో దీపిక, ఆమె సోదరుడు మదన్‌లాల్‌ కూడా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్‌, నెక్కొండ సీఐ చంద్రమోహన్‌ పర్యవేక్షణలో చెన్నారావు, గూడూరు, నెక్కొండ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామంలో బందోబస్తు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని