ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌!

బిహార్‌ (Bihar) రాజధాని పట్నా (Patna)లోని రైల్వే స్టేషన్‌కు సోమవారం రాత్రి ఓ బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ ఫోన్‌ కాల్‌పై విచారణ చేపట్టిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన కారణం విని పోలీసులు ఆశ్చర్యపోయారు.  

Published : 31 May 2023 01:18 IST

పట్నా: ప్రియుడితో కలిసి పారిపోయిన తన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు ఓ భర్త చేసిన పని అతడిని కటకటాలపాల్జేసింది. విచారణలో అతను చెప్పిన కారణం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. బిహార్‌ (Bihar) రాజధాని పట్నా(Patna)లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

‘‘పట్నా రైల్వే స్టేషన్‌లో బాంబు ఉందని, కొద్ది నిమిషాల్లో స్టేషన్‌ మొత్తం పేలిపోతుందని సోమవారం రాత్రి ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం (RPF) స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. తర్వాత స్టేషన్‌లోని అన్ని వెయిటింగ్‌ రూమ్‌లు, ఫ్లాట్‌ఫామ్‌లు, లగేజ్‌ రూమ్‌లతోపాటు ప్రయాణికుల లగేజ్‌, పార్కింగ్ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువుని గుర్తించలేదు. దీనిపై స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు’’ అని పట్నా రైల్వే స్టేషన్‌ ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ విపిన్‌ చతుర్వేది తెలిపారు.

బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌ చేసిన వ్యక్తిని రాజేష్‌ కుమార్‌ రంజన్‌గా గుర్తించారు. తన భార్య ప్రియుడితో పారిపోవడంతో ఆమెను తిరిగి ఇంటికి రప్పించేందుకు బాంబు ఉందంటూ ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. అయితే, రాజేష్‌ చెబుతోన్నది నిజమేనా? లేదా? ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే అంశంపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని