HYD News: డ్రగ్స్‌ కోసం ఇంటినే ల్యాబ్‌గా మార్చాడు.. ఒక్క గ్రామ్‌తో 20మందికి కిక్కిచ్చాడు

జూబ్లీహిల్స్‌ పరిధిలో డ్రగ్స్‌ తయారు చేసి, విక్రయిస్తూ పట్టుబడిన శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సూర్యాపేట

Published : 01 Apr 2022 01:33 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పరిధిలో డ్రగ్స్‌ తయారు చేసి, విక్రయిస్తూ పట్టుబడిన శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీరామ్‌ బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చాడు. చదువుకునే రోజుల్లోనే మత్తు పదార్థాలకు అలవాటు పడిన అతను... ఉద్యోగం లేక చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. చివరికి తానే మత్తు మందు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేశాడు. హిమాలయాలు, రిషికేష్‌ తదితర ప్రాంతాలకు వెళ్లి విదేశీ పర్యాటకుల నుంచి డీఎంటీ తయారీ విధానం తెలుసుకున్నాడు. అందుకు కావాల్సిన ముడి సరకును కొన్ని ఈ కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేశాడు.

మరి కొన్ని రసాయనాల కోసం ఎవరికీ అనుమానం రాకుండా దుకాణాల వద్దకు ఒక కెమిస్ట్రీ విద్యార్థి లాగా వెళ్లి ప్రాక్టికల్స్‌ కోసం అవసరమని చెప్పి కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో కొండాపూర్‌లో ఉంటున్న తన ఇంటినే ల్యాబ్‌గా మార్చాడు. దాదాపు రెండేళ్లపాటు ప్రయోగాలు చేసి ఎట్టకేలకు మత్తు మందు తయారీలో సక్సెస్‌ అయ్యాడు. తొలుత తనతో పాటు స్నేహితులపై పరీక్షించి డ్రగ్స్‌ పనిచేస్తున్నాయని నిర్ధారణకు వచ్చాడు. ఒక గ్రాముతో 20 మందికి కిక్కు ఇస్తుందని స్వయంగా తెలుసుకున్నాడు. ఆ మత్తు పదార్థాన్ని సేవించేందుకు ప్రత్యేక పరికరాలను కూడా సేకరించి విక్రయించడం ప్రారంభించాడు. తాను తయారు చేసిన డ్రగ్‌ ఆవిరి రూపంలో ఓ పరికరం నుంచి సేవించాలని వినియోగదారులకు తెలిపాడు. ఇతనికి పరిచయం అయిన... సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో కస్టమర్‌ సర్వీసు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న దీపక్‌కు కూడా విక్రయించాడు. క్రమంగా డిమాండ్‌ పెరగడంతో ఒక గ్రాము రూ.8వేల చొప్పున విక్రయించడం మొదలుపెట్టాడు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న క్రమంలో శ్రీరామ్‌తో పాటు దీపక్‌ అనే వినియోగదారుడిని నార్కోటిక్‌ విభాగం అరెస్టు చేసింది. వీరి నుంచి 8 గ్రాముల డీఎంటీ డ్రగ్‌, తయారీ పరికరాలు, రెండు మొబైల్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని ఇంటిని పరిశీలించిన పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన ల్యాబ్‌, అందులో ఉన్న పరికరాలు చూసి అవాక్కయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని