Hyderabad: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. ఆ నలుగురిని మేజర్లుగా పరిగణించిన కోర్టు

జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో జువైనల్‌ జస్టిస్‌ బోర్డు కీలక తీర్పు వెల్లడించింది. నేర తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ  కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగా పరిగణించింది.

Updated : 30 Sep 2022 19:12 IST

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లను నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. తీవ్ర నేరం చేసిన దృష్ట్యా ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారణ చేపట్టాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు నేరాభియోగపత్రం దాఖలు చేశారు. 

విచారణ చేపట్టిన జువైనల్‌ జస్టిస్‌ బోర్డు.. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని నిర్ధరించింది. మానసిక నిపుణులతో పాటు జువైనల్‌ బోర్డు సభ్యులు సమీక్షించి న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా జువైనల్‌ సెక్షన్‌ 15 ప్రకారం నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ బోర్డు అంచనాకు వచ్చింది. ఎమ్మెల్యే కుమారుడిని జువైనల్‌గా పరిగణించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఆదేశించింది.

ఈ ఏడాది మే 28న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలిక(17)ను కొందరు మైనర్లు ఇంటి వద్ద దించుతామని నమ్మించి కారులో తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. సాదుద్దీన్‌ మాలిక్‌(19)తోపాటు మరో ఐదుగురు మైనర్లను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని