పాకిస్థాన్‌లో మ్యాచ్‌..హైదరాబాద్‌లో బెట్టింగ్‌

గుట్టుచప్పుడు కాకుండా కూకట్‌పల్లి, నిజాంపేట్‌ కేంద్రాలుగా పాకిస్థాన్‌లో జరుగుతున్న సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లకు భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలను సైబరాబాద్‌ మాదాపూర్‌ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌..

Published : 23 Jun 2021 01:21 IST

హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా కూకట్‌పల్లి, నిజాంపేట్‌ కేంద్రాలుగా పాకిస్థాన్‌లో జరుగుతున్న సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లకు భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలను సైబరాబాద్‌ మాదాపూర్‌ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. బండారీ లేఅవుట్‌లోని పావని రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఈ ముఠా బెట్టింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోమన్న, అతని అనుచరులు సత్య పవన్‌కుమార్‌, సతీష్‌రాజు మరో ముగ్గురు కలిసి ఈ తతంగం నడుపుతున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ.22.50 లక్షలు, 33 చరవాణులు, బెట్టింగ్‌ బోర్డు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాల్లో జరిగే మ్యాచ్‌లకు సైతం వీరు బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు గుర్తించామని సీపీ వెల్లడించారు.

‘‘ఎవరికీ అనుమానం రాకుండా జరుగుతున్న బెట్టింగ్‌ గురించి సమాచారం అందుకున్న వెంటనే బెట్టింగ్‌ నడిపిస్తున్న అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. ప్రధాన సూత్రధారి సోమన్న తప్పించుకున్నారు. హవాలా, ఆన్‌లైన్‌లో నిందితులు నగదు బదిలీ చేస్తున్నట్టు విచారణలో తేలింది. లైవ్‌ లైన్‌గురు, క్రికెట్‌ మజా, లోటస్‌, బెట్‌ 365, బెట్‌ ఫెయిర్‌ వంటి యాప్‌ల ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు తేలింది. పరారీలో ఉన్న సోమన్న కోసం గాలిస్తున్నాం. సోమన్న పట్టుబడితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది’’ అని సజ్జనార్‌ తెలిపారు. ఎక్కువ మంది యువత, విద్యార్థులు బెట్టింగ్‌ ఉచ్చులో చిక్కుకుంటున్నారని.. తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిస్తే డయిల్‌ 100, వాట్సాప్‌ నంబర్‌ 94906-17444కు సమాచారం అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని