
Crime News: ఏడోఅంతస్తు నుంచి దూకి ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య
ముంబయి: ఐఐటీ బాంబేకు చెందిన దర్శన్ మాలవీయ అనే విద్యార్థి(26) సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీజీ రెండో సంవత్సరం చదువుతున్న దర్శన్ సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో హాస్టల్ ఏడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. దర్శన్ అచేతన స్థితిలో పడిఉండడం గమనించిన అక్కడి వాచ్‌మన్ అధికారులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అతణ్ని ఘట్కోపర్‌లోని రాజావడి ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
దర్శన్ హాస్టల్ గదిలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చావుకు ఎవరూ బాధ్యులుకారని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తాను గత కొంతకాలంగా ‘డిప్రెషన్’లో ఉన్నానని.. దానికి చికిత్స కూడా తీసుకుంటున్నానని లేఖలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణం కింద దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్శన్ మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.