Robbery: కుమారుడికే కత్తి పెట్టి.. దోపిడీకి యత్నించి..!

అనుకోకుండా సొంత కుమారుడినే దోచుకునేందుకు యత్నించాడో తండ్రి. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఇది చోటుచేసుకుంది. ఈ ఘటనలో నేరస్థుడికి 26 నెలల జైలుశిక్ష పడింది.

Updated : 12 Mar 2023 16:50 IST

లండన్‌: తేలికగా డబ్బు సంపాదించాలి అనుకున్న ఓ వ్యక్తి.. అనుకోకుండా సొంత కొడుకునే దోచుకునేందు(Robbery)కు యత్నించి జైలు పాలైన ఘటన ఇది. స్కాట్లాండ్‌(Scotland)లోని గ్లాస్గో(Glasgow)లో చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల యువకుడు స్థానికంగా ఓ ఏటీఎంకు వెళ్లి నగదు తీసుకున్నాడు. అంతలోనే ముసుగు ధరించిన ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి.. అతన్ని వెనుకనుంచి అదిమి పట్టి, మెడపై కత్తి పెట్టాడు. నగదు ఇవ్వాలంటూ బెదిరించాడు. అయితే, నిందితుడి గొంతును గుర్తుపట్టిన యువకుడు.. వెంటనే అతన్ని తన తండ్రిగా గుర్తించాడు. ‘నిజంగా ఈ పని చేస్తున్నారా? నన్ను గుర్తుపట్టారా?’ అని ప్రశ్నించాడు.

అయితే, ఇవేమీ పట్టించుకోనని నిందితుడు చెప్పాడు. ఈ క్రమంలోనే వెనుకకు తిరిగిన యువకుడు.. తండ్రి ముసుగును లాగేశాడు. దీంతో ఇప్పటివరకు తాను కత్తి పెట్టింది తన బిడ్డకేనని తెలుసుకొని తండ్రి షాక్‌ తిన్నాడు! నిస్సహాయ స్థితిలో ఈ పని చేయాల్సి వచ్చిందని చెబుతూ.. క్షమించమని కోరాడు. మరోవైపు.. ఆ యువకుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పాడు. తానే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించిన తండ్రి.. ఏటీఎం వద్ద ఉన్నది తన కుమారుడన్న విషయం తెలియలేదన్నాడు. ఈ కేసులో అతనికి 26 నెలల జైలు శిక్ష పడినట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని