miryalaguda: కదులుతున్న రైలులో మహిళపై అసభ్య ప్రవర్తన

రైలులో మహిళపై యువకుడి అసభ్య ప్రవర్తనతో పెనుగులాట జరిగి బాధితురాలితో పాటు నిందితుడు కిందపడి గాయాలపాలయ్యారు.

Published : 10 Jul 2024 03:12 IST

పెనుగులాటలో జారిపడిన బాధితురాలు, నిందితుడు

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: రైలులో మహిళపై యువకుడి అసభ్య ప్రవర్తనతో పెనుగులాట జరిగి బాధితురాలితో పాటు నిందితుడు కిందపడి గాయాలపాలయ్యారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వివాహిత.. హైదరాబాద్‌లో భర్తతో కలిసి నివసిస్తోంది. ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె.. మంగళవారం సొంతూరికి వెళ్లేందుకు సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయలుదేరారు. ఆమె ప్రయాణించే రిజర్వేషన్‌ బోగీలో ఒడిశాకు చెందిన బిశ్వాస్‌ అనే యువకుడు ఉన్నాడు. ఆమె వాష్‌రూంకు వెళ్లి వస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగి ఇద్దరూ కదిలే రైలు నుంచి కిందపడగా, ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. బాధిత మహిళ.. గాయాలతో రక్తమోడుతూ, చిరిగిన దుస్తులతో చీకట్లో అరకిలోమీటరు దూరం నడుచుకుంటూ సమీపంలోని వాటర్‌ ట్యాంకు తండా గ్రామానికి చేరుకుంది. గమనించిన మాజీ సర్పంచి రామచంద్రునాయక్, గ్రామస్థులు.. దుస్తులు మార్పించి పట్టణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో బిశ్వాస్‌ను రైల్వే పోలీసులు వెతికి, 108 ద్వారా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని