Uttarpradesh: మందలించాడని ఆగ్రహం.. ప్రిన్సిపల్‌పై విద్యార్థి కాల్పులు!

తనను మందలించాడన్న కోపంతో ఓ విద్యార్థి ఏకంగా ప్రిన్సిపల్‌పై నాటు తుపాకీతో కాల్పులకు దిగాడు. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar pradesh)లోని సీతాపుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ....

Published : 24 Sep 2022 21:25 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌లో ఘటన

లఖ్‌నవూ: తక్కువ మార్కులు వేశారన్న కారణంతో ఇటీవల ఝార్ఖండ్‌లో ఓ ఉపాధ్యాయుడిని, క్లర్క్‌ను విద్యార్థులు చెట్టుకు కట్టి కొట్టారు. ఈ ఘటనను మరవకముందే.. తనను మందలించాడన్న కోపంతో ఓ విద్యార్థి ఏకంగా ప్రిన్సిపల్‌పై నాటు తుపాకీతో కాల్పులకు దిగాడు. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar pradesh)లోని సీతాపుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. సీతాపుర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. సదర్‌పుర్‌ ఠాణా పరిధిలోని ఓ కళాశాలలో శుక్రవారం ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ప్రిన్సిపల్‌ జోక్యం చేసుకుని వారిద్దరిని మందలించారు.

దీంతో.. ఇద్దరిలో ఓ విద్యార్థి శనివారం నాటు తుపాకీతో కళాశాలలో ప్రిన్సిపల్‌పై కాల్పులకు దిగాడు.  తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాదమేమి లేదని స్థానిక ఏఎస్పీ రాజీవ్‌ దీక్షిత్‌ వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను లఖ్‌నవూకు తరలించినట్లు చెప్పారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. సీసీటీవీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. చేతిలో నాటు తుపాకీతో ప్రిన్సిపల్‌పై దాడి చేయడం, ఇద్దరు పెనుగులాడటం, ఈ క్రమంలోనే అక్కడున్న వారు వచ్చి విద్యార్థిని పట్టుకోవడం వంటి దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే, మందలించినందుకుగానూ ఆ విద్యార్థి ఇంతకు తెగిస్తాడని తనకు తెలియదని బాధితుడు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని