‘మోసగాళ్లు’లాగే మోసగించారు!

గతంలో జరిగిన ఓ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఇటీవల ‘మోసగాళ్లు’ సినిమా విడుదలై విషయం తెలిసిందే. కాజల్‌, మంచు విష్ణు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అక్కాతమ్ముడిగా నటించిన వీరిద్దరు ఓ నకిలీ కాల్‌సెంటర్‌ ద్వారా అమెరికన్ల నుంచి రూ.2,600కోట్లు

Published : 22 Mar 2021 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో జరిగిన ఓ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఇటీవల ‘మోసగాళ్లు’ సినిమా విడుదలై విషయం తెలిసిందే. కాజల్‌, మంచు విష్ణు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అక్కాతమ్ముడిగా నటించిన వీరిద్దరు ఓ నకిలీ కాల్‌సెంటర్‌ ద్వారా అమెరికన్ల నుంచి రూ.2,600కోట్లు దోచుకుంటారు. దిల్లీలోనూ ఓ ముఠా అచ్చం అదే విధంగా అమెరికన్లతోపాటు కెనడియన్లనూ మోసం చేసి రూ.కోట్లు కొల్లగొట్టింది. తాజాగా దిల్లీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ ముఠాలోని 34 మందిని అరెస్టు చేశారు. వారు చెప్పిన కథనం ప్రకారం..

దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఓ ముఠా విదేశీయులే లక్ష్యంగా ఒక కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసింది. యూఎస్‌ డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ అధికారులమంటూ ఈ కాల్‌ సెంటర్‌ సిబ్బంది అమెరికా, కెనడా ప్రజలకు ఫోన్‌ చేసేవారు. ‘మీ బ్యాంక్‌ ఖాతాలోని డబ్బుతో మెక్సికోలో డ్రగ్స్‌ కొనుగోలుకు లావాదేవీలు జరిగాయని, ఈ నేరం కింద పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేయబోతున్నారు’అని భయపెట్టేవారు. ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు బాధితులు బిట్‌కాయిన్‌ లేదా గూగుల్‌ గిఫ్ట్‌ ద్వారా ఈ ముఠాకు డబ్బులు పంపించేవారు. అంతేకాదు.. మెకాఫీ, యాపిల్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి.. బాధితుల ఫోన్లు హ్యాక్‌కు గురయ్యానని నమ్మించేవారు. వాటిని సరి చేయాలంటే ఖర్చు అవుతుందని డబ్బులు వసూలు చేశారు. అలా గత మూడేళ్లలో అమెరికా, కెనడాకు చెందిన దాదాపు 8వేల మంది నుంచి రూ.10కోట్లు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరైన అనుమతులు లేకుండా కాల్‌ సెంటర్స్‌ నడుస్తున్నాయని సమాచారం రావడంతో స్పెషల్‌ సెల్‌ పోలీసులు దాడి చేసి.. విచారణ జరపగా ఈ మోసగాళ్ల బండారం బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితులు క్షితిజ్‌ బాలి, అభిషేక్, ధనంజయ్‌ నేగి సహా 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని