జర్నలిస్టుకు ₹40వేలు టోకరా.. హిప్నటైజ్‌ చేసి మరీ డబ్బులు కొట్టేశారా!?

Hypnotise: దిల్లీలో ఓ కొత్త సైబర్‌ నేరం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తనను హిప్నటైజ్‌ చేసి మరీ డబ్బులు కొట్టేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందుకు ఆస్కారం లేదని పోలీసులు కొట్టిపారేశారు.

Published : 12 May 2023 01:27 IST

దిల్లీ: దేశంలో సైబర్‌ నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కొందరు సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు అధికారిలా ఫోన్‌ చేసి డబ్బులు కొట్టేస్తే.. ఇంకొకరు లింకులు పంపించి సొమ్ము కాజేస్తుంటారు. ఇప్పటి వరకు చూసిన సైబర్‌ నేరాలన్నీ దాదాపు ఈ కోవకు చెందినవే. అయితే, ఒక వ్యక్తిని హిప్నటైజ్‌ చేసి మరీ డబ్బులు కొట్టేయడం ఇప్పటి వరకు జరగలేదు! అదీ ఫోన్‌లో! కానీ, తన విషయంలో అదే జరిగిందంటున్నాడు దిల్లీకి చెందిన ఓ వ్యక్తి!! ఫోన్‌లో మాటలతో తనను హిప్నటైజ్‌ చేసి మరీ డబ్బు కొట్టేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అది హిప్నటైజ్‌ కాదని పోలీసులు పేర్కొనడం గమనార్హం.

దిల్లీలో రమేశ్‌ కుమార్‌ రాజా అనే ఓ జర్నలిస్టు తాను హిప్నటైజ్‌కు గురై రూ.40 వేలు పోగొట్టుకున్నానంటూ ఏప్రిల్‌ 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఒక వ్యక్తి నాకు ఫోన్‌ చేసి అతడికి నేను బాగా తెలిసినట్లుగా మాట్లాడాడు. అప్పటికీ తాను ఎవరో నాకు తెలీదు అని చెప్పినా వినిపించుకోలేదు. తీరా నా స్నేహితుడి గొంతులా ఉండటంతో నేనూ నమ్మా. తర్వాత ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ సందర్భంలో ఎవరికో డబ్బు పంపాలని అతడు నాకు చెప్పారు. అయితే అతడికి ఆన్‌లైన్‌ పేమెంట్‌ సదుపాయం లేకపోవడంతో నా అకౌంట్‌లో వేస్తాననడంతో అందుకు ఓకే చెప్పా. అతడు సాయంత్రం నా దగ్గర తీసుకుంటాడని చెప్పాడు. అలా నన్ను మాటల్లో ముంచి తనకు తెలీకుండానే రెండుసార్లు పేటీఎం ద్వారా నా బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.20వేలు చొప్పున రెండు సార్లు డబ్బు కాజేశాడు’’ అని రాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు హిప్నటైజ్‌కు గురై అతడు చెప్పిన సూచనలన్నీ పాటించానని చెప్పుకొచ్చాడు.

‘‘అవతలి వ్యక్తి తొలుత ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో అని మొదట రూ.2 పంపుతానని అన్నాడు. అతను పంపిన పేటీఎం సందేశాన్ని తెరిచి పిన్‌ ఎంటర్‌ చేస్తే.. నా ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.2 కట్‌ అయ్యాయి. అదే విషయం అతడికి చెప్పా. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పి నాకు రూ.4 పంపాడు. తర్వాత రూ.20వేలు పంపుతున్నానని పేటీఎంలో సందేశం పంపాడు. అంతకుముందులానే పిన్‌ ఎంటర్‌ చేశా. ఇలా రెండుసార్లు జరిగింది. కాసేపటికి రూ.40 వేలు కట్‌ అయిన విషయం తెలుసుకునేలోగా.. అవతలి వ్యక్తి ఫోన్‌ కట్‌ చేశాడు’’ రాజా పేర్కొన్నాడు. 

సైబర్‌ మోసానికి గురయ్యాడని గ్రహించిన రాజా తొలుత ఎస్‌బీఐ, పేటీఎం సంస్థలకు లేఖ రాశాడు. అనంతరం ఉత్తర దిల్లీ సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. మాటల సందర్భంలో తనను హిప్నటైజ్‌ చేశారని పేర్కొన్నాడు. అయితే, రాజా వాదనను పోలీసులు తోసిపుచ్చారు. బాగా తెలిసిన వ్యక్తిలా మట్లాడి, స్నేహపూర్వకంగా చాట్‌ చేశాక ఇలా మోసం చేసిన ఘటనలు చాలా ఉన్నాయని తెలిపారు. ఇక్కడ హిప్నటైజ్‌కు ఆస్కారం లేదని చెప్పారు. అయినా ఫోన్‌లో ఇలా హిప్నటైజ్‌ చేయడం కుదరదని హిప్నాటిజంలో 30 ఏళ్లు అనుభవం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. స్నేహపూర్వకంగా మెసులుతూ మోసాలు చేయడం కొత్త రకమైన నేరమని సైబర్‌ నిపుణులు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు