Crime News: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌... బెంజికారులో కీలక ఆధారాలు?

జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పెద్దల ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తును నీరుగారుస్తున్నారంటూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు దూకుడు పెంచారు.

Updated : 05 Jun 2022 21:20 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పెద్దల ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తును నీరుగారుస్తున్నారంటూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు మరో నిందితుడు ఉమర్ ఖాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈకేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ను నియమించారు.

ఈకేసులో ఇప్పటికే నిందితులు దుశ్చర్యకు ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణులు బెంజికారుతో పాటు ఇన్నోవా కారును ఆదివారం సాయంత్రం క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, బెంజికారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పును క్లూస్‌ టీమ్‌ సీజ్‌ చేసింది. ఇన్నోవా కారులో నిందితుల వీర్య నమూనాలను ఫోరెన్సిక్‌ బృందం గుర్తించింది. రెండు వాహనాల్లో బాలిక వెంట్రుకలను క్లూస్‌ టీమ్‌, ఫోరెన్సిక్‌ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన గత నెల 28న జరిగితే పోలీసులకు బాధితురాలి తండ్రి 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు. మరుసటి రోజు బెంజి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు మూడు రోజులు పట్టించుకోలేదు. ఇన్నోవా కారును ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత నిన్న సాయంత్రం మొయినా బాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలోనే నిందితులు.. వాహనం చిక్కకుండా మొయినా బాద్‌లోని ఓ రాజకీయనేత ఫామ్‌హౌస్‌ వెనుక దాచేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్‌ కనిపిచంచకుండా, టీఆర్‌ నంబర్‌కూడా గుర్తుపట్టకుండా చేశారు. మరో వైపు ఘటన తర్వాత షాక్‌కు గురైన బాలిక పూర్తిగా కోలుకోవడంతో పోలీసులు మరో సారి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు.

అఘాయిత్యం జరిగింది ఏ కారులో?
జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలికను ఇంటివద్ద దిగబెడతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు బెంజి కారులో ఎక్కించుకున్నారు. అందులో పబ్‌ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తున్నప్పుడే బాలికపై అత్యాచారయత్నం చేసినట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని కాన్సు బేకరీ వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడికి ఇన్నోవా కారును డ్రైవర్‌ తీసుకురాగా.. ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు ఇప్పుడే వస్తామంటూ వేచి ఉండాలని డ్రైవర్‌కు చెప్పి అతడిని వదిలి వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో కన్పించింది. సాదుద్దీన్‌ మాలిక్‌ (18), అమేర్‌ ఖాన్‌ (18)లతో పాటు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు (16), సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత కుమారుడు (16), బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు (16) కలిసి బాలికను బెదిరించి ఆమెను బెంజి కారు నుంచి ఇన్నోవా వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇన్నోవాలో ఎమ్మెల్యే కుమారుడు (17) సైతం ఉన్నాడు. అతడు కొద్ది నిమిషాల్లోనే కారు దిగి బేకరీ వైపు వెళ్లాడని తొలుత పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తాజాగా హల్‌చల్‌ అయిన వీడియో నేపథ్యంలో మరోసారి బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు అతడిని ఏ6 నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని