Darshan: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌ అరెస్టు

తనతో సహజీవనం చేస్తున్న నటికి అసభ్య సందేశాలు పంపినందుకు ఒక యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ చలనచిత్ర నటుడు దర్శన్‌ తూగుదీపను బెంగళూరు నగర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Updated : 12 Jun 2024 09:53 IST

సహజీవన భాగస్వామికి అసభ్య సందేశాలు పంపినందుకు ఘాతుకం!

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: తనతో సహజీవనం చేస్తున్న నటికి అసభ్య సందేశాలు పంపినందుకు ఒక యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ చలనచిత్ర నటుడు దర్శన్‌ తూగుదీపను బెంగళూరు నగర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. పవిత్రా గౌడ అనే నటి, దర్శన్‌ పదేళ్లుగా సహజీవన బంధంలో ఉన్నారు. దర్శన్‌కు ఇది వరకే విజయలక్ష్మి అనే మహిళతో పెళ్లి కావడంతో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చుపెట్టారని దర్శన్‌ అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి (28) ఆగ్రహంతో ఉండేవాడు. అందులో భాగంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో జూన్‌ 8వ తేదీన స్వామిని దర్శన్‌ బెంగళూరుకు పిలిపించుకున్నాడు. పట్టణగెరె సమీపంలోని ఒక షెడ్డుకు అతడిని తీసుకెళ్లి సహచరులు, బౌన్సర్ల సాయంతో తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలై స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఆ మృతదేహాన్ని కామాక్షిపాళ్య ఠాణా పరిధిలోని ఒక మురుగు కాలువలో పడేసి వెళ్లిపోయారు. ముగ్గురు నిందితులు గిరినగర ఠాణా ముందు లొంగిపోయి.. ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదంతోనే హత్య చేశామని వెల్లడించారు. విచారణలో ఒక్కొక్కరి పేరును వెల్లడిస్తూ, చివరకు దర్శన్‌ పేరును బయటపెట్టారు. దర్శన్, పవిత్రగౌడ, చిత్రదుర్గ జిల్లా దర్శన్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర, హత్యకు సహకరించిన ముగ్గురు బౌన్సర్లతో కలిపి పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని