
కీసర కేసు: ఏసీబీ కస్టడీకి నిందితులు
హైదరాబాద్: వివాదాస్పద భూమి విషయంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన కీసర తహశీల్దార్ నాగరాజు కేసులో నిందితులను అనిశా అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు అనుమతితో చంచలగూడ జైల్లో ఉన్న నలుగురు నిందితులను అధికారులు ఇవాళ అనిశా ప్రధాన కార్యాలయానికి తరలించారు. తహశీల్దార్ నాగరాజు, వీర్ఏ సాయిరాజ్, స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్లను అనిశా అధికారులు విచారిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్లకు రూ.1.10కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? లంచం తీసుకున్న తహశీల్దార్ నాగరాజు వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో అనిశా అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల కోట్ల రూపాయల విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా స్థిరాస్తి వ్యాపారుల పేరు మీద మార్చడానికి తహశీల్దార్ నాగరాజు రూ.రెండు కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్ కలిసి నాగరాజుకు రూ.1.10కోట్ల లంచం ఇస్తుండగా పక్కా సమాచారంతో అనిశా అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా నిందితులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా అనిశా అధికారులు ఏసీబీ కోర్టును కోరారు. నేటి నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు వీరిని కస్టడీలోకి ఏసీబీ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.