Crime News: నడిరోడ్డుపై మహిళకు దారుణ అవమానం.. కేజ్రీవాల్ ఫైర్..!

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య ఉన్న శత్రుత్వం.. నడిరోడ్డుపై ఒక మహిళను దారుణంగా అవమానించేలా చేసింది.

Published : 28 Jan 2022 01:42 IST

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య ఉన్న శత్రుత్వం.. నడిరోడ్డుపై ఒక మహిళను దారుణంగా అవమానించేలా చేసింది. ఆమెపై సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. నిందితులకు అంతధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడ్డారు.

ఒక మహిళ జుత్తు కత్తిరించి, ముఖమంతా నలుపు రంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి వివేక్ విహార్ ప్రాంతంలో రోడ్డుపై ఊరేగిస్తోన్న వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది. అప్పుడు పక్కనే ఉన్న పలువురు మహిళలు ఈ ఘటనను అడ్డుకోక పోగా.. కేరింతలు కొట్టడం కనిపించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు వివాహిత. ఆమె ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఒక బాలుడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అందుకు ఈ మహిళే కారణమని బాలుడి తరఫు బంధువులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలను దిల్లీ మహిళా కమిషన్ ట్విటర్‌లో షేర్‌ చేసింది. అక్రమ మద్యం విక్రయదారులు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మహిళా కమిషన్ ఛైర్మన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశామని, విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. 

ఇది సిగ్గుచేటు చర్య: ‘ఈ ఘటన సిగ్గుచేటు చర్య. ఇలా ప్రవర్తించేందుకు వారికి అంతధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రమంత్రి అమిత్‌ షా, లెఫ్టినెంట్ గవర్నర్‌ను అభ్యర్థిస్తున్నాను. అలాంటి దురాగతాలను, ఈ తరహా చర్యలకు పాల్పడేవారిని దిల్లీ వాసులు ఏ మాత్రం సహించరు’ అని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని