Kerala: మామ సంపదపై కన్నేసి.. రూ.100 కోట్లకుపైగా కాజేసి!

పిల్లనిచ్చిన మామ ఇంటికే కన్నం పెట్టాడో అల్లుడు. ఆయన సంపదపై కన్నేసి.. స్థిర, చరాస్తుల రూపంలో ఏకంగా రూ.100 కోట్లకుపైగా కొల్లగొట్టడం గమనార్హం. అల్లుడి చేతిలో మోసపోయినట్లు ఐదేళ్లకు గ్రహించిన ఆయన.. ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. కేరళలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

Published : 25 Nov 2022 17:21 IST

తిరువనంతపురం: పిల్లనిచ్చిన మామ ఇంటికే కన్నం పెట్టాడో అల్లుడు. ఆయన సంపదపై కన్నేసి.. స్థిర, చరాస్తుల రూపంలో ఏకంగా రూ.100 కోట్లకుపైగా కొల్లగొట్టడం గమనార్హం. అల్లుడి చేతిలో మోసపోయినట్లు ఐదేళ్లకు గ్రహించిన ఆయన.. ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. కేరళలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ఉండే అబ్దుల్‌ లాహీర్‌ హసన్‌ అనే వ్యాపారవేత్త.. కేరళకు చెందిన మహమ్మద్‌ హఫీజ్‌కు 2017లో తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో వెయ్యి సవర్ల బంగారాన్ని తన బిడ్డకు బహుమతిగా ఇచ్చారు.

ఈ క్రమంలోనే మామ ఆస్తిపై కన్నేసిన అతను.. క్రమంగా ఆయన ఆస్తులను తన పేరు మీద మార్చుకోవడం ప్రారంభించాడు. ఇలా సుమారు రూ.107 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను కాజేశాడు. సొంత అల్లుడే తనను మోసం చేశాడని ఎట్టకేలకు గుర్తించిన హసన్‌.. మూడు నెలల క్రితమే కేరళలోని అలువ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.100 కోట్లకుపైగా మోసం, నిందితుడు పరారీలో ఉండటం తదితర కారణాలతో తాజాగా ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో హఫీజ్‌తోపాటు అతని సహచరుడు అక్షయ్‌ థామస్‌ వైద్యన్‌ పాత్ర కూడా ఉందని హసన్‌ తన ఫిర్యాదు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాడుల్లో జరిమానా పడిందని, ఈ మొత్తాన్ని చెల్లించేందుకు దాదాపు రూ.4 కోట్లు కావాలని అడిగినప్పటి నుంచి ఈ మోసాల తంతు మొదలైందని హసన్ వెల్లడించారు. స్థలాల కొనుగోలు, చెప్పుల షోరూం ఏర్పాటు.. ఇలా రకరకాల సాకులు చెబుతూ రూ.92 కోట్ల వరకు రాబట్టాడని వాపోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. నిందితుడిని అరెస్టు చేయడంలో వారు విఫలమైనట్లు ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆరోపించారు. ఇప్పటివరకు అతని వద్ద నుంచి రూ.కోటిన్నర విలువైన కారును కూడా స్వాధీనం చేసుకోలేకపోయారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని