TS News: బైక్‌ లిఫ్ట్‌ అడిగి ఇంజెక్షన్‌తో చంపిన ఘటనలో కీలక పురోగతి.. కారణం ఇదే..!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంజెక్షన్‌తో దాడి చేసి వ్యక్తిని చంపిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం....

Updated : 20 Sep 2022 23:45 IST

ఖమ్మం: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంజెక్షన్‌తో దాడి చేసి వ్యక్తిని చంపిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలో సోమవారం జరిగిన ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. జమాల్‌ సాహెబ్‌ అనే వ్యక్తి హత్యలో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుల కోసం ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపడంతో ప్రత్యేక దృష్టి సారించిన ఖమ్మం నగర పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌.. ఈ హత్య కేసులో మిస్టరీని ఛేదించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అయితే, చింతకాని మండలం మున్నేటికి చెందినవారు ఈ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. జమాల్‌ సాహెబ్‌ను చంపేందుకు నిందితులు పక్కా ప్రణాళిక రచించినట్టు గుర్తించారు. ఈ హత్యలో ఇద్దరు డ్రైవర్లు, ఒక ఆర్‌ఎంపీ వైద్యుడి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. జమాల్‌ భార్య ఫోన్‌ కాల్‌ జాబితాలో నిందితుల ఫోన్‌ నంబర్లు ఉన్నాయని..  వారితోనే ఆమె ఎక్కువసార్లు మాట్లాడినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. 

ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసు బృందాలు.. తొలుత ముదిగొండ, చింతకాని మండలాల్లో తనిఖీలు చేపట్టాయి.  సోమవారం ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోయినప్పటికీ మంగళవారం ఈ కేసు పురోగతికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించారు. గతంలో ఎన్నడూలేని విధంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్‌ అడిగి మరీ వెనుకనుంచి ఇంజెక్షన్‌ ఇచ్చి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతో ఈ కేసును ఛేదించడం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు 24గంటల్లోనే కీలక ఆధారాలు సేకరించారు. ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ హత్యకు దారితీసిన కారణాలేంటి? ఇదే మార్గాన్ని నిందితులు ఎందుకు ఎంచుకున్నారనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. తొలుత ఘటనా స్థలానికి వెళ్లి.. జమాల్‌ సాహెబ్‌కు మంచినీళ్లు ఇచ్చిన యువకులను విచారించారు. ఆ తర్వాత స్థానిక గ్రామాలతో పాటు రహదారులపై ఉన్న పలు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.

దీంతో జమాల్‌ సాహెబ్‌ కుటుంబ సభ్యులకు ఈ హత్యలో ఏమైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో దృష్టిసారించిన పోలీసులు.. మృతుడి కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్‌ డేటాను సేకరించారు. అందులో కొందరు వ్యక్తులతో ఆయన భార్య సంభాషించినట్టు పక్కా వివరాలు సేకరించి ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నించారు. హత్యకు కుట్ర పన్నిన ముగ్గురు వ్యక్తులు.. జమాల్‌ సాహెబ్‌ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని లిఫ్ట్‌ అడిగి చంపినట్టు సమాచారం. పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ చింతకాని మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ఈ హత్య కేసులో ప్రమేయం ఉందని గుర్తించారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ హత్యకు ప్రధానంగా వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఇంజెక్షన్‌తోనే దాడి చేయడానికి కారణాలేంటి? అందులో వాడిన రసాయనం ఏంటి? తదితర వివరాలను పోలీసు ఉన్నతాధికారులు బుధవారం మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని