Crime News: గచ్చిబౌలిలో కిడ్నాప్‌ కలకలం.. బాండ్లపై సంతకాలు పెట్టించుకొని వదిలేశారు

నగరంలోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిడ్నాప్‌ ఘటన కలకలం సృష్టించింది. ఎస్‌వోటీ పోలీసులమంటూ ఓ కంపెనీ ఎండీతోపాటు సేల్స్‌ కోఆర్డినేటర్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. 

Published : 16 Jun 2024 17:38 IST

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిడ్నాప్‌ ఘటన కలకలం సృష్టించింది. ఎస్‌వోటీ పోలీసులమంటూ ఓ కంపెనీ ఎండీతోపాటు సేల్స్‌ కోఆర్డినేటర్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. గచ్చిబౌలిలో ఓ కంపెనీని నిర్వహిస్తోన్న సాయి గుప్తాను గతంలో వ్యాపార భాగస్వామిగా ఉన్న గౌతమ్‌ భవిరి శెట్టి కిడ్నాప్‌ చేయించినట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా సాయి గుప్తా, గౌతమ్‌ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో సాయి గుప్తా కారులో వెళ్తుండగా.. దుండగులు ఫార్చునర్‌, ఐ20 కార్లలో వచ్చి అతడి కారును ఢీకొట్టారు. అనంతరం ఎస్‌వోటీ పోలీసులమని చెప్పి.. అతడిని, అతడితోపాటు ఉన్న సేల్స్‌ కోఆర్డినేటర్‌ను వారి కారులో ఎక్కించుకున్నారు. 

మొదట జగద్గిరిగుట్టలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరిపై దాడి చేశారు. చంపేస్తామని బెదిరించి కుటుంబసభ్యులతో రూ.4 కోట్లు తెప్పించాలని డిమాండ్‌ చేశారు. అక్కడి నుంచి తిరిగి వికారాబాద్‌ తీసుకెళ్లి మరోసారి దాడికి పాల్పడ్డారు. కిడ్నాప్‌ విషయం తెలియగానే సాయి గుప్తా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమకోసం గాలిస్తున్నారని తెలుసుకున్న దుండగులు ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు చేయించుకొని వారిద్దరినీ వికారాబాద్‌లో వదిలి వెళ్లిపోయారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో మొత్తం 13 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కిడ్నాప్‌కి సూత్రధారి గౌతమ్‌ పోలీసు అదుపులో ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని