వైద్యుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ నగర శివారులో పట్టపగలే  కిడ్నాప్‌ అయిన దంతవైద్యుడి కేసును అనంతపురం పోలీసులు ఛేదించారు. హైదరాబాద్‌లో దంతవైద్యంతో పాటు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న హుస్సేన్‌ను కొందరు ..

Updated : 28 Oct 2020 16:23 IST

హైదరాబాద్‌: నగర శివారు రాజేంద్రనగర్‌లో పట్టపగలే కిడ్నాప్‌కు గురైన దంతవైద్యుడి కేసును ఏపీలోని అనంతపురం పోలీసులు ఛేదించారు. దంతవైద్యంతో పాటు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న బెహజత్‌ హుస్సేన్‌ను కొందరు దుండగులు నిన్న మధ్యాహ్నం బుర్ఖాలో వచ్చి కిడ్నాప్‌ చేశారు. సైబరాబాద్‌ పోలీసుల సమాచారం మేరకు బెంగళూరు వైపు తీసుకెళ్తుండగా అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. రాత్రి నుంచి 44వ జాతీయ రహదారిపై కాపలాకాసిన పోలీసులు.. రాప్తాడు సమీపంలో కిడ్నాపర్లను నిలువరించారు. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్‌ జరిగిన 12 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. నిందితుల నుంచి 3 కార్లు, 7 మొబైల్‌ ఫోన్లు, బొమ్మ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

ఏం జరిగిందంటే?
హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ లోని ప్రెస్టిజ్‌ విల్లాస్‌లో దంత వైద్యుడు బెహజత్‌ హుస్సేన్‌(57) నివసిస్తున్నారు. బండ్లగూడ జాగీర్‌లో ప్రధాన రహదారిపై ఉన్న సొంత భవనంలో క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. మంగళవారం రోగులను పరీక్షిస్తూ తీరిక లేకుండా ఉన్న ఆయన మధ్యాహ్నం ఒంటిగంట దాటడంతో భోజనానికి ఇంటికెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఆ సమయంలో తనతోపాటు తన వ్యక్తిగత సహాయకుడు సయ్యద్‌ సల్మాన్‌(20) మాత్రమే క్లినిక్‌లో ఉన్నారు. సరిగ్గా 1.30 గంటలకు అయిదారుగురు గుర్తుతెలియని వ్యక్తులు నల్లటి బురఖాలు ధరించి క్లినిక్‌ లోపలికొచ్చారు. సయ్యద్‌ సల్మాన్‌ను తీవ్రంగా కొట్టారు. మూతికి ప్లాస్టర్‌ను వేసి కాళ్లు, చేతులు కట్టేసి మరుగుదొడ్డిలో పడేశారు. ఆ తర్వాత వైద్యుణ్ని కొట్టారు. టేబుల్‌పై ఉన్న ఇన్నోవా కారు(ఏపీ 09వై 0031) తాళం తీసుకుని హుస్సేన్‌ను ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. బలవంతంగా వైద్యుని కారులోనే ఎక్కించుకుని ఆరె మైసమ్మ(శంకర్‌పల్లి రోడ్డు) వైపు దౌడు తీశారు. కొంతసేపటికి తేరుకున్న సయ్యద్‌.. ఎలాగోలా మరుగుదొడ్డి నుంచి బయటపడి పాకుకుంటూ కొంతదూరం వెళ్లి కట్లు విప్పుకొని వైద్యుని ఇంట్లోనే పనిచేసే తన తండ్రికి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పాడు. అలా హుస్సేన్‌ భార్యకు విషయం తెలియడంతో డయల్‌ 100కు ఫిర్యాదు చేయగానే రాజేంద్రనగర్‌ పోలీసులు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. క్లూస్‌టీం చేరుకుని రక్తపు మరకల నమూనాలను సేకరించింది. రాత్రి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌, శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఆస్తి తగాదాలే కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని